బాబు కోసం రోడ్డు మీదికి టెక్కీలు: లగడపాటి ఫ్లెక్సీలు
తిరుపతి/ విజయవాడ: తిరుపతి నగరంలో ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ రంగం ఉద్యోగులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. చెన్నై-బెంగుళూరుకు చెందిన టెక్కీలు శనివారం ఉదయం ఒక్క క్షణం ఆలోచించండి పేరుతో తిరుపతిలో పాదయాత్ర చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలంటూ నినాదాలు చేశారు. తొమ్మిది సంవత్సరాల చంద్రబాబు పాలనలో యువతకు ఎంతో మేలు జరిగిందని, ఇదే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తామని సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ రంగం ఉద్యోగులు చెప్పారు.

ఇదిలావుంటే, రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ రాజకీయ సన్యాసం ప్రకటించిన మాజీ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్‌ను ప్రశంసిస్తూ కృష్ణా జిల్లాలో ఫ్లెక్సీలు సందడి చేస్తున్నాయి. మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు కుమారుడు వసంత కృష్ణప్రసాద్ పేరిట వెలసిన ఫ్లెక్సీలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. సమైక్యాంధ్ర కోసం లగడపాటి చేసిన పోరాటాన్ని కొనియాడుతూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.
రాష్ట్ర విభజన ఖాయం కావడంతో తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు లగడపాటి ఇటీవల ప్రకటించారు. కాంగ్రెసు పార్టీకి, లోకసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామా ఆమోదం కూడా పొందింది. ఈ స్థితిలో ఆయన పేరు మీద ఫ్లెక్సీలు ఏర్పడడం చర్చనీయాంశంగా మారింది.












Click it and Unblock the Notifications