వైసీపీపై బండి సంజయ్ ఘాటు విమర్శలు: గూండాలుగా
అమరావతి: అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలంటూ ఈ ప్రాంత రైతులు చేపట్టిన ఆందోళనలు, నిరసన దీక్షలు ఇవ్వాళ 1,200 రోజులకు చేరాయి. రాష్ట్రంలో మూడు రాజధానులను ఏర్పాటు చేస్తామంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాలుగేళ్ల కిందట అసెంబ్లీలో ప్రకటించిన తరువాత అమరావతి ప్రాంత రైతులు ఈ ఆందోళనలకు శ్రీకారం చుట్టారు. అమరావతి ప్రాంతంలో పెద్ద ఎత్తున దీక్షా శిబిరాలను ఏర్పాటు చేశారు.
ఈ నేపథ్యంలో ఇవ్వాళ టీడీపీ నాయకుడు కన్నా లక్ష్మీనారాయణ, బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్, ఆదినారాయణ రెడ్డి, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు- మరోసారి రైతుల నిరసన దీక్షలను సందర్శించారు. మందడంలో రైతులతో మాట్లాడారు. తాము అండగా ఉంటామని హామీ ఇచ్చారు. మందడం దీక్షా శిబిరం నుంచి సత్యకుమార్ తుళ్లూరుకు బయలుదేరి వెళ్లారు. అక్కడ పార్టీ నాయకులను పరామర్శించిన అనంతరం విజయవాడ వైపు వెళ్తోన్న సమయంలో ఉద్దండరాయునిపాలెం వద్ద ఆయన కారుపై రాళ్ల దాడి చోటు చేసుకుంది.

కొందరు వ్యక్తులు సత్యకుమార్ ప్రయాణిస్తోన్న కారుపై రాళ్లు విసిరారు. ఈ ఘటనలో సత్యకుమార్ కారు అద్దాలు పగిలాయి. మూడు రాజధానులకు మద్దతుగా వెలిసిన దీక్షా శిబిరాల సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సత్యకుమార్ అనుచరుడిపైనా దాడి చేశారు. మూడు రాజధానులకు మద్దతు పలుకుతున్న వారే ఈ దాడి చేసి ఉంటారని అనుమానిస్తోన్నారు. బీజేపీ నాయకులు మాత్రం- ఈ దాడి వెనుక వైసీపీ నాయకులు ఉన్నారంటూ ఆరోపిస్తోన్నారు. రాళ్ల దాడికి నిరసనగా రోడ్డుపై బైఠాయించారు.
దీనితో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. సత్యకుమార్ పై జరిగిన దాడి పట్ల బీజేపీ తెలంగాణ రాష్ట్రశాఖ అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై ఘాటు విమర్శలు చేశారు. వైసీపీ నాయకులను గూండాలుగా అభివర్ణించారు. రైతులను ఆదుకోవడానికి వెళ్లినందుకు దాడి చేయడం హేయమైన చర్య అంటూ మండిపడ్డారు. ఈ చర్య ద్వారా అధికార వైఎస్ఆర్సీపీ రైతు వ్యతిరేకి అనేది స్పష్టమైందని బండి సంజయ్ అన్నారు. రైతుల సమస్యలపై పోరాడుతున్న ఎస్సీ, ఎస్టీ, వెనుకబడిన తరగతికి చెందిన నేతలపై దాడులు చేయడం దుర్మార్గమైన చర్య అని అన్నారు.
ఇలాంటి దాడులను బీజేపీ ఎప్పటికీ సహించబోదని, కార్యకర్తల సహనాన్ని నిస్సహాయతగా భావించకూడదని ఆయన వైసీపీని హెచ్చరించారు. ఈ దాడిపై ఏపీ ప్రభుత్వం వెంటనే స్పందించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. దాడి చేసిన వారిపై కేసు నమోదు చేయాలని, వారిని వెంటనే అరెస్టు చేయాలని అన్నారు. మళ్లీ ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకోవాలని తెలంగాణ బీజేపీ తరఫున డిమాండ్ చేస్తోన్నానని బండి సంజయ్ చెప్పారు.












Click it and Unblock the Notifications