బిస్కెట్ ఆశ చూపి మూడేళ్ల బాలికపై అత్యాచారం.. రాజుకున్న రాజకీయ రచ్చ!
తమిళనాడు రాష్ట్రంలోని తిరువళ్లూరు జిల్లా అత్యంత అమానుష ఘటన వెలుగుచూసింది. ఆదివారం కనిపించకుండా పోయిన ఓ మూడేళ్ల చిన్నారి పొదల్లో తీవ్ర గాయాలతో కనిపించింది. ఆ చిన్నారిపై లైంగిక దాడి జరిగినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆ పసికందు ప్రాణాలు విడిచింది. ఈ దారుణానికి సంబంధించి పోలీసులు బీహార్ కు చెందిన 19 ఏళ్ల వలస కార్మికుడిని అరెస్ట్ చేశారు. ఈ అమానుష ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
బిస్కెట్లు ఇస్తానని నమ్మించి..
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఆ చిన్నారి తన ఇంటి సమీపంలో ఆడుకుంటూ కనిపించకుండా పోయింది. నిందితుడు ఆ చిన్నారికి బిస్కెట్ ప్యాకెట్ ఇస్తానని ఆశ చూపి లోబరుచుకున్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. సాయంత్రం 6 గంటలైనా పాప ఇంటికి రాకపోవడంతో తల్లి వెతకడం ప్రారంభించింది. ఆ చిన్నారి పొదల్లో తీవ్ర రక్తస్రావంతో, అత్యంత విషమ పరిస్థితిలో కనిపించింది. వెంటనే ఆ చిన్నారిని ఆస్పత్రికి తరలించినప్పటికీ.. అప్పటికే పరిస్థితి చేయి దాటిపోవడంతో పాప ప్రాణాలు కోల్పోయింది. బీహార్ నుంచి వచ్చిన వలస కార్మికుడిని పట్టుకుని స్థానికులు పోలీసులకు అప్పగించారు. మరికొందరిపైనా అనుమానంతో స్థానికులు దాడి చేశారు. ఈ క్రమంలో ఆ చిన్నారిపై సామూహిక అత్యాచారం జరగలేదని.. ఒకరి ప్రమేయం మాత్రమే ఉందని పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం నిందితుడిపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.

ముదిరిన రాజకీయ రగడ
ఈ ఘోరం తమిళనాడులో తీవ్ర రాజకీయ దుమారానికి దారితీసింది. రాష్ట్రంలో మహిళలు, పిల్లలపై జరుగుతున్న అఘాయిత్యాలపై విపక్షాలు మండిపడుతున్నాయి. ఈ ఘటనపై డీఎంకే ఎంపీ కనిమొళి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మూడేళ్ల చిన్నారిని పొదల్లోకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడటం తనను తీవ్రం కలచిపేసిందని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. మహిళలు తమ పిల్లల రక్షణ విషయంలో జాగ్రత్తలు వహించాలని కోరుతూనే.. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణపై ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
టీవీకే ప్రభుత్వంపై ఉదయనిధి స్టాలిన్ ఫైర్
డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ కూడా ఈ ఘటనపై అధికార టీవీకే ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుపడ్డారు. సీఎం విజయ్ నేతృత్వంలోని సర్కారులో మహిళలు, పిల్లలపై నేరాలు నిత్యకృత్యంగా మారిపోయాయని ఆరోపించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు మరణశయ్యపై ఉన్నాయని విమర్శించారు. ముఖ్యమంత్రి వెంటనే ఉన్నతస్థాయి పోలీస్ అధికారులతో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసి నేరాల నియంత్రణకు కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సీఎం విజయ్ బాధ్యతలు చేపట్టాక మహిళల రక్షణ కోసం 'సింగప్పెణ్' అనే ప్రత్యేక విభాగాన్ని ప్రారంభించిన కొద్ది రోజుల్లోనే ఈ దారుణం జరగడం గమనార్హం.












Click it and Unblock the Notifications