తెలంగాణ, ఏపీ విభజనలో ఆస్తుల పంపకాల సమస్యలున్నాయ్.. పవన్ కళ్యాణ్ సంచలనం
ఢిల్లీలో జనసేన పార్టీ నిర్వహించిన 'సేన ప్రస్థానం' సమావేశంలో ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ విభజన విషయంలో మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. 2014లో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన విభజన ప్రక్రియ సరైన పద్ధతిలో జరగలేదని, దీని వల్ల రెండు రాష్ట్రాల మధ్య ఇప్పటికీ ఆస్తుల పంపకాల సమస్యలు, వారసత్వ సమస్యలు కొనసాగుతున్నాయని తీవ్రంగా విమర్శించారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు జనసేన ఎప్పుడూ వ్యతిరేకం కాదు: పవన్ కళ్యాణ్
పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు జనసేన ఎప్పుడూ వ్యతిరేకం అని చెప్పలేదని స్పష్టం చేశారు. అయితే ఉమ్మడి రాష్ట్రాన్ని విభజించిన తీరు అసంతృప్తి, అశాంతిని సృష్టించిందని ఆవేదన వ్యక్తం చేశారు. విభజన తర్వాత 12 ఏళ్లు గడిచినా ఆస్తుల పంపకం, వారసత్వ సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదని, కాంగ్రెస్ పార్టీ ధోరణి ఏ మాత్రం మారలేదని మండిపడ్డారు.

జనసేన సభకు అనుమతి ఇవ్వనిది అందుకే
ఇటీవల హైదరాబాద్‌లో జనసేన సభకు అనుమతి ఇవ్వకపోవడం దీనికి స్పష్టమైన ఉదాహరణ అని చెప్పారు. తెలుగు రాష్ట్రాల నాయకులు ఢిల్లీకి వెళ్లి కేంద్రం మేడలు వంచుతాం అని, మాటలు చెప్పినా, అక్కడికి చేరగానే వాటిని అమలు చేయలేకపోతున్నారని ప్రశ్నించారు. దక్షిణాది రాష్ట్రాల సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లడంలో జనసేన స్పష్టమైన వైఖరి అనుసరిస్తుందని ఆయన పేర్కొన్నారు.
దేశ ఐక్యత, ప్రాంతీయ ఆకాంక్షల సమన్వయం కోసం జనసేన
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ జనసేన 12 ఏళ్ల ప్రయాణాన్ని కూడా సమీక్షించారు. లక్ష సభ్యులతో ప్రారంభమైన పార్టీ నేడు 20 లక్షలకు పైగా సభ్యత్వం సాధించిందని, గత ఎన్నికల్లో 21 ఎమ్మెల్యేలు, 3 ఎంపీలను గెలిపించుకుందని తెలిపారు. అధికారం కోసం కాకుండా దేశ ఐక్యత, ప్రాంతీయ ఆకాంక్షల సమన్వయం కోసం జనసేన పని చేస్తుందని ఆయన పేర్కొన్నారు.
రెండు రాష్ట్రాల మధ్య స్నేహపూర్వక సంబంధాల బలోపేతం
ఈ వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమవుతున్నాయి. విభజన తర్వాత కూడా కొనసాగుతున్న సమస్యలను పరిష్కరించడం ద్వారా రెండు రాష్ట్రాల మధ్య స్నేహపూర్వక సంబంధాలను బలోపేతం చేయాలని పవన్ కళ్యాణ్ అన్నారు. అసంతృప్తి, అశాంతితో విభజించిన కాంగ్రెస్ తీరును తప్పుబట్టాం తప్పా, తెలంగాణ ఏర్పాటుకు ఏనాడు జనసేన పార్టీ వ్యతిరేకం కాదు అని మరోమారు పవన్ కళ్యాణ్ స్పష్టం చేసారు.












Click it and Unblock the Notifications