ఏపీలో తెలంగాణా వాసులకు జగన్ పెద్దపీట .. కీలక పదవులు .. ఏపీలో హాట్ టాపిక్
Recommended Video
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెలంగాణ ప్రాంత వాసులకు ఏపీ ప్రభుత్వంలో కీలక పదవులు కట్టబెడుతున్నారు అన్నది ఏపీలో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. నీళ్లు, నిధులు, నియామకాలు పేరుతో ఉద్యమం సాధించిన తెలంగాణ ప్రాంత ప్రజలు, తెలంగాణ రాష్ట్ర సాధన లో సఫలీకృతులయ్యారు. ఆ తర్వాత స్వరాష్ట్రం స్వపరిపాలన పేరుతో తెలంగాణ రాష్ట్రం పాలన సాగిస్తోంది. కానీ ఇప్పుడు తెలంగాణా విషయంలో జగన్ తీరుతో ఆసక్తికర చర్చ ఊపందుకుంది .

తెలంగాణ ప్రభుత్వంలో ఏపీ వాసులకు స్థానం లేదు.. కానీ ఏపీలో ప్రత్యేకమైన స్థానం
అలాంటి తెలంగాణ రాష్ట్రంలో ఏపీ కి సంబంధించిన ప్రముఖులకు కానీ, కీలకమైన నాయకులకు కానీ తెలంగాణ ప్రభుత్వంలో స్థానం కల్పించలేదు. కానీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం విషయంలో మాత్రం పలువురు తెలంగాణ వాసులకు కీలకమైన బాధ్యతలు అప్పజెప్పారు.
ఏపీలో ఈ దఫా జరిగిన సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ భారీ విజయాన్ని నమోదు చేసుకుని ఏపీ ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత జగన్ పదవి బాధ్యతలు చేపట్టిన తరువాత ముఖ్యమంత్రిగా జగన్ తనదైన శైలిలో కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళుతున్నారు.

తెలంగాణా వాసులకు పెద్దపీట వేసి కీలక పదవులు అప్పగించిన సీఎం జగన్
ఇక సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి కొన్ని కీలక పదవుల్లో ఏపీలో ఉన్న వారిని పక్కన పెట్టి తెలంగాణ వాసులకు అవకాశం కల్పించారు. ఇప్పటికే ఏపీ ప్రభుత్వ జాతీయ మీడియా మరియు అంతరాష్ట్ర సలహాదారునిగా సీనియర్ జర్నలిస్ట్ దేవులపల్లి అమర్, సమాచార శాఖ కమిషనర్‌గా విజయకుమార్, కమ్యూనికేషన్స్ సలహాదారుగా కృష్ణమోహన్ వంటి వారికి అవకాశం ఇచ్చారు జగన్. ఇక వీరంతా తెలంగాణవాసులే కావడంతో పదవులన్ని తెలంగాణవాసులకి, అందునా తెలంగాణా వాదులకు ఇవ్వడం ఏంటి అని కూడా కొందరు ప్రభుత్వ తీరుపై చాలా అసహనంతో ఉన్నారు.

ఉన్నత విద్యాకమీషన్ చైర్మన్‌గా వంగాల ఈశ్వరయ్య గౌడ్ నియమించాలని నిర్ణయం
అయితే తాజాగా జగన్ ఉన్నత విద్యాకమీషన్ చైర్మన్‌గా వంగాల ఈశ్వరయ్య గౌడ్‌ను నియమించాలని నిర్ణయించారు. ఇక ఈయన సైతం తెలంగాణ ప్రాంత వాసి కావడంతో ఏపీలో తెలంగాణ వాసులకు సీఎం జగన్ పెద్దపీట వేస్తున్నారు అన్న అంశం రాష్ట్రంలో హాట్ టాపిక్ అయింది. వంగాల ఈశ్వరయ్య గౌడ్ నల్గొండ ప్రాంతానికి చెందినవాడు. ఏపీ హైకోర్ట్ మాజీ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన ఈయన రిటైర్ అయిన తరువాత బీసీల హక్కుల కోసం పోరాటం చేస్తున్నారు.

తెలంగాణా కోసం ఉద్యమం చేసిన వారికి ఏపీలో కీలక పదవులని ఏపీలో అసహనం
అయితే సీఎం జగన్ పెద్దపీట వేసి పదవులు అప్పగించిన వారు తెలంగాణ ఉద్యమ సమయంలో ఆంధ్రులను తప్పు పట్టిన వారని, అలాంటివారికి పదవులు ఇవ్వడమేమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు.
ఏపీలో ఎంతో మంది ప్రముఖులు ఉండగా, సమర్థులైన వారిని పక్కనపెట్టి తెలంగాణ వాదులకు పదవులు ఇవ్వడం సరికాదని పలువురు ఏపీ కి సంబంధించిన ప్రముఖులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

ఏపీలో సమర్ధులు లేరా అన్న ప్రశ్న .. ఇలాగే కొనసాగితే సీఎం జగన్ కు ఇబ్బందే
అయితే జగన్ మాత్రం ఇవేవి పట్టించుకోకుండా తనకు నచ్చిన వారికి పదవులు ఇస్తున్నారు. ఇక ఇది ఇలాగే కొనసాగితే దీని పైన కూడా పెద్ద ఎత్తున దుమారం రేగే ప్రమాదం ఉంది. ఒకపక్క తెలంగాణ రాష్ట్రం తెలంగాణ ప్రాంత వాసులకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తే, ఏపీలో సమర్ధులు లేనట్టు సీఎం జగన్ తెలంగాణ ప్రాంత వాసులకు ప్రభుత్వంలో కీలక పదవులు కట్టబెట్టడం సమంజసం కాదనే వాదన గట్టిగానే వినిపిస్తోంది. మరి జగన్ ఇక్కడితో ఆగుతారా.. లేదా ఇలాగే కొనసాగిస్తారా అనేది వేచి చూడాల్సిందే.












Click it and Unblock the Notifications