సింగిల్‌గా వస్తానని శవాలతో వస్తున్నావేంటన్నా?
ఎన్నికలకు సింగిల్ గా వస్తానని చెప్పిన ముఖ్యమంత్రి జగన్ శవాలతో వస్తున్నారని, 2014లో తండ్రి, 2019లో బాబాయ్ మరణాలపై సానుభూతి పొందినట్లుగా పెన్షన్ దారుల మరణాలను కూడా అడ్డం పెట్టుకొని అధికారంలోకి రావాలని చూస్తున్నారంటూ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు తాడేపల్లిలో లోకేష్ సమక్షంలో టీడీపీలో చేరారు. గుంటూరు మాజీ డిప్యూటీ మేయర్, వైసీపీ బీసీ సెల్ నాయకుడు తాడిశెట్టి మురళీమోహన్ తోపాటు పలువురు నాయకులు టీడీపీలో చేరినవారిలో ఉన్నారు.
జగన్ పాలనలో బీసీ సోదరులపై 26 వేలకు పైగా అక్రమ కేసులు నమోదు చేశారని లోకేష్ వెల్లడించారు. బాపట్ల జిల్లాలో అక్కను వేధిస్తున్నారని ప్రశ్నించినందుకు అమర్‌నాథ్‌గౌడ్ అనే బాలుణ్ని పెట్రోల్ పోసి దారుణంగా చంపడం అత్యంత హేయమని, బీసీల రక్షణకు ప్రత్యేక చట్టం తీసుకువస్తామన్నారు. కడప జిల్లాల పెండ్లిమర్రిలో బీసీ వర్గానికి చెందిన శ్రీనివాసులను కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి ముఠా హతమార్చిందని, అతని భూమిని కబ్జా చేశారని లోకేష్ మండిపడ్డారు.

రాష్ట్రం రూ.12 లక్షల కోట్ల అప్పుల్లో ఉందని, రాష్ట్రం మనుగడ సాగించాలంటే కేంద్రం సహకారం అవసరమన్నారు. ఐదు సంవత్సరాల కాలంలో రాష్ట్రంలో జరిగిన విధ్వంసంపై వెయ్యిమంది ఎన్నారైలతో లోకేష్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అందరూ స్వదేశానికి వచ్చి ఎన్నికల్లో రాష్ట్ర భవిష్యత్తు కోసం ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా అనంతపురంకు చెందిన వైసీపీ నాయకులు జయరాం నాయుడు, అనంతపురం రూరల్ ఎంపీపీ హేమలత, సర్పంచ్ ఉదయ్, ఎంపీటీసీ సభ్యురాలు జ్యోతి తదితరులు పచ్చ కండువా కప్పుకున్నారు. ఉండవల్లిలోని లోకేష్ నివాసంలో వీరంతా టీడీపీలో చేరారు.












Click it and Unblock the Notifications