బీ అలర్ట్, భారీ వర్షాలు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!!
తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణం కనిపిస్తోంది. రుతుపవనాలు వచ్చినా ఆశించిన స్థాయిలో వర్షాలు పడటం లేదు. జూన్ నెల నామమాత్రంగానే వర్షాలు కురిసాయి. జూలై తొలి వారంలో రైతుల ఆశలు ఫలించలేదు. ఈ సమయంలో ద్రోణి కారణంగా అక్కడక్కడా వర్షాలు పడినా .. పలు ప్రాంతాల్లో ఉక్కపోత వాతావరణం నెలకొంది. తాజాగా ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ ఏపీలో పలు జిల్లాలకు వర్షాల పైన హెచ్చరిక చేసింది.
ఏపీలోని పలు జిల్లాలకు ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ వర్షాల పైన హెచ్చరికలు జారీ చేసింది. ఈ రోజు, రేపు మేఘావృతమైన వాతావరణంతోపాటు ఉత్తరాంధ్ర జిల్లాలు, కోనసీమ, ఏలూరు, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, కడప, అన్నమయ్య, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. అయితే, కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతోపాటు భారీ ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. శనివారం కూడా రాష్ట్రంలో ఇదే పరిస్థితి ఉంటుందని తెలిపింది.

అదే విధంగా రాష్ట్రంలో వర్షాలకుతోడు పలు ప్రాంతాల్లో 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనాగా వెల్లడించింది. మరోవైపు.. ఎల్‌నినో ముప్పు నేపథ్యంలో రైతులు పంటల సాగు విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. గత వారంలో స్వల్పంగానే వర్షపాతం కొన్ని జిల్లాల్లో నమోదైంది. దీంతో, ఖరీఫ్ పంటల సాగుపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మారుతున్న వాతావరణ పరిస్థితుల్లో తక్కువ నీటి వినియోగంతో పండించే పంటల సాగును చేపట్టాలని అధికారులు రైతులకు సూచిస్తున్నారు. ప్రభుత్వం కూడా ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు అవగాహన కల్పిస్తోంది. కాగా, తాజా వర్షాల పైన అంచనాలతో రైతులు ఆశగా వేచి చూస్తున్నారు.












Click it and Unblock the Notifications