ఈ పాపం ఎవరిది? కేవలం 5 రోజుల్లోనే అమరేశ్వరుడి అంతర్ధానం
హిమాలయాల్లో పరమేశ్వరుడి దర్శనం.. ఎన్నో జన్మల పుణ్యఫలంగా హిందువుల భావించే అత్యంత పవిత్రమైన అమర్‌నాథ్ యాత్రలో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. 57 రోజుల పాటు దర్శనమివ్వాల్సిన బాబా బర్ఫానీ (మంచు శివలింగం) ఈ సారి యాత్ర ప్రారంభమై ఐదో రోజులకే కరిగిపోయింది. ఈ పాపం ఎవరిది. కారణాలేంటి. ఎన్నో ఆశలతో దర్శనానికి వెళ్ళిన భక్తులకు గతేడాది ఉగ్రదాడి. ఈ ఏడాది నేరుగా శివలింగమే లేని పరిస్థితి. జులై 3న కట్టుదిట్టమైన భద్రత మధ్య యాత్ర అత్యంత వైభవంగా ప్రారంభమైంది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈసారి రికార్డు స్థాయిలో భక్తులు తరలిరాగ లింగ దర్శనం మాత్ర కనుమరుగైంది
గత కొన్నేళ్లుగా భక్తుల రద్దీ గణనీయంగా పెరుగుతోంది. ఈ ఏడాది మొదటి నాలుగు రోజుల్లోనే ఏకంగా 93,000 మందికి పైగా భక్తులు శివలింగాన్ని దర్శించుకున్నారు. జులై 5 నాటికి 32,000 మందికి పైగా భక్తులు పూజలు చేయగా, ఒక్క రెండో రోజే 20,000 మందికి పైగా దర్శించుకున్నారు. గత నాలుగేళ్లలో ఇదే అత్యధిక రెండవ రోజు రికార్డు అని అక్కడి ప్రభుత్వం పేర్కొంది.

సుప్రీం ఆదేశాలు బేఖాతరు..
అయితే, సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం పహల్గామ్, బల్తాల్ మార్గాల ద్వారా రోజుకు కేవలం 10 వేల మంది చొప్పున మాత్రమే భక్తులను అనుమతించాలనే నిబంధన ఉంది. కానీ, ఎలాంటి రిజిస్ట్రేషన్లు, తప్పనిసరి ఆరోగ్య ధృవీకరణ పత్రాలు (Health Certificates) లేని వేలాది మంది అనధికారిక భక్తులు యాత్రకు వస్తున్నారని, దీనివల్ల భద్రతతో పాటు అక్కడి మౌలిక వసతులపై తీవ్ర ఒత్తిడి పడుతోందని అధికార యంత్రాంగం ఆందోళన వ్యక్తం చేసింది.
ఆ షెల్టర్ వలనే..
గుహ సమీపంలో ఇటీవల నిర్మించిన వర్షపు షెల్టర్ (Rain Shelter) అక్కడి స్థానిక సూక్ష్మ వాతావరణాన్ని (Microclimate) మార్చివేసి, మంచు లింగం త్వరగా కరగడానికి కారణమవుతోందని కూడా భక్తులు అంటున్నారు. ఎక్కువ మంది భక్తులు ఈ షెల్టర్ లోకి ప్రవేశించినప్పుడు వారి శరీరాల నుంచి విడుదలయ్యే వేడి శివలింగాన్ని తర్వగా కరిగేలా చేస్తుందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు.
కేవలం వాతావరణ మార్పే కారణమా?
హిమాలయాల్లో గత దశాబ్ద కాలంగా ప్రపంచంలోని ఇతర పర్వత ప్రాంతాల కంటే వేగంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. గుహ చుట్టుపక్కల పెరుగుతున్న వేడి, హ్యుమిడిటీ కారణంగా మంచు లింగం కరిగిపోవడం సహజమే అయినప్పటికీ, ఈసారి కేవలం వారం రోజుల్లోనే కరిగిపోవడం పర్యావరణ వినాశనానికి అద్దం పడుతోంది. గతంలో 2018లో 29 రోజులు, 2020లో 38 రోజులు, 2022లో 28 రోజులు, 2024లో వారం రోజుల్లో మంచు లింగం కరిగిన దాఖలాలు ఉన్నాయి.
వాతావరణ మార్పులతో పాటు, యాత్ర మార్గాల్లో రోడ్ల విస్తరణ, భారీ యంత్రాల వాడకం, హెలికాప్టర్ సర్వీసులు, గుహకు అత్యంత సమీపంలో లంగర్లు ఏర్పాటు చేయడం వంటి మానవ ప్రమేయ చర్యలు కూడా ఈ సున్నితమైన హిమాలయ పర్యావరణ వ్యవస్థను దెబ్బతీస్తున్నాయని స్థానికులు, నిపుణులు వాపోతున్నారు. లక్షలాది మంది హిందువుల సెంటిమెంట్‌తో ముడిపడి ఉన్న అమర్‌నాథ్ యాత్రను సురక్షితంగా నిర్వహించడంతో పాటు, ప్రకృతి సంపదను, పవిత్ర బాబా బర్ఫానీ మంచు లింగాన్ని కాపాడుకోవడానికి తక్షణమే శాస్త్రీయ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.














Click it and Unblock the Notifications