Lok Sabha Debate: లోక్ సభలో వాడీవేడీ చర్చ- సై అంటే సై..!
నీట్ ప్రశ్నాపత్రం లీక్, విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా నేపథ్యంలో కేంద్రం తీసుకొచ్చిన పేపర్ లీక్ వ్యతిరేక బిల్లు (
పబ్లిక్ ఎగ్జామినేషన్స్ చట్ట సవరణ)పై ఇవాళ లోక్ సభ (Lok Sabha)లో చర్చ ప్రారంభమైంది. 10 గంటల పాటు చర్చకు సిద్దంగా ఉన్నట్లు కేంద్రం లోక్ సభలో ప్రకటించింది. అనంతరం ఈ బిల్లుపై చర్చను ప్రారంభించిన కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్.. ఈ చట్టాన్ని ముందుగా ఎన్డీఏ ప్రభుత్వమే ప్రవేశపెట్టిందని, స్వతంత్ర భారత దేశంలో ఇది బహుశా మొట్టమొదటిది అని అన్నారు. ఈ బిల్లు భారత పార్లమెంట్ చరిత్రలో ఒక మైలురాయి అన్నారు. ఎన్డీయే రాకముందే దేశంలో చాలా పేపర్లు లీక్ అయ్యాయన్నారు.
అనంతరం మాట్లాడిన కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గగోయ్.. పేపర్ లీక్ నిరోధక బిల్లుకు ప్రతిపాదించిన సవరణలను పరిశీలించిన తర్వాత, పేపర్ లీక్ సమస్యను పరిష్కరించడంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో లేదని, ఎటువంటి అర్థవంతమైన మార్పును తీసుకురావాలని అనుకోవడం లేదని తనకు అనిపిస్తోందన్నారు. రెండేళ్ల క్రితం అసలు బిల్లును ప్రవేశపెట్టినప్పుడు, విద్యా రంగాన్ని బలోపేతం చేసే, పేపర్ లీక్‌లను అరికట్టే చారిత్రాత్మక చర్యగా ప్రభుత్వం దానిని అభివర్ణించిందని గుర్తుచేశారు. ఇప్పుడు ప్రతిపాదించిన సవరణలు కేవలం కంటితుడుపు చర్య అని విమర్శించారు.

తర్వాత మాట్లాడిన బీజేపీ ఎంపీ బాన్సురీ స్వరాజ్.. 2014కు ముందు 22 పేపర్ లీక్‌లు అయ్యాయన్నారు. యూపీఏ హయాంలో 2014కు ముందు ఒకటి రెండు కాదు, ఏకంగా 22 పేపర్ లీక్ ఘటనలు జరిగాయని, తర్వాత పరీక్షలు రద్దు చేశారన్నారు.
మాజీ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు పిలుపునిచ్చినప్పుడు పంజాబ్ విద్యాశాఖ మంత్రి రాజీనామాను డిమాండ్ చేశారా అని ఆమె గగోయ్ ను ప్రశ్నించారు.
మరోవైపు విద్యాశాఖ మంత్రిగా ధర్మేంద్ర ప్రధాన్‌ను తొలగించడం ద్వారా ప్రభుత్వం ప్రధానిని కాపాడిందని సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ పేర్కొన్నారు. తమ డిమాండ్లను అంగీకరించేలా ప్రభుత్వాన్ని ఒత్తిడి చేసిన జెన్ జెడ్‌ను కూడా ఆయన ప్రశంసించారు. జవాబుదారీతనం అంటే అవినీతిపరుల బ్యాంకు ఖాతాలను నింపగల సామర్థ్యమని బీజేపీ ప్రభుత్వం భావిస్తోందా? అని అఖిలేష్ ప్రశ్నించారు. రామ మందిర విరాళాల డబ్బును దొంగిలించిన వారు పేపర్ లీక్‌లను ఆపలేరన్నారు. కేంద్ర ప్రభుత్వం దేశంలోని వెనుకబడిన వర్గాల విద్యాహక్కులను దొంగిలించిందని, మోదీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా లక్షకు పైగా పాఠశాలలను మూసివేసిందని ఆరోపించారు. ఆత్మహత్య చేసుకున్న నీట్ అభ్యర్థులకు అఖిలేష్ నివాళులర్పించారు.

అనంతరం టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ పేపర్ లీక్ నిరోధక బిల్లుకు మద్దతు తెలిపారు. తానే రాజేసిన నిప్పును బీజేపీ ఆర్పడానికి ప్రయత్నిస్తోందని ఆయన అన్నారు. దేశంలో పరీక్ష పేపర్ లీకులు ఒక పద్ధతిగా మారిపోయాయని, అవి ప్రమాదవశాత్తు జరిగేవి కావని, పేపర్ లీక్ ఇప్పుడు ఒక వ్యవస్థగా తయారైందని విమర్శించారు. నిరసన చేస్తున్న విద్యార్థులపై మోదీ ప్రభుత్వం టియర్ గ్యాస్, లాఠీచార్జికి పాల్పడతామని ప్రతిపాదించిందన్నారు. ప్రభుత్వం పోలీసుల క్రూరత్వానికి పాల్పడుతోందన్నారు. రీ-నీట్ పేపర్ల రవాణాకు ఐఏఎఫ్ హెలికాప్టర్లను ఉపయోగించడాన్ని అభిషేక్ బెనర్జీ ఎద్దేవా చేసారు.












Click it and Unblock the Notifications