బ్యాంకుల సమ్మె వాయిదా, తెల్లవారేసరికి మారిన సీన్.. నేడు వర్కింగ్ డే
గత కొద్ది రోజులుగా సామాన్యులను, వ్యాపార వర్గాలను తీవ్రంగా కలవరపెడుతున్న బ్యాంక్ సమ్మె ముప్పు ఎట్టకేలకు తప్పింది. ఇవాళ్టి నుంచి వరుసగా మూడు రోజుల పాటు బ్యాంకులు మూతపడతాయన్న వార్తలతో ఆందోళన చెందిన కస్టమర్లకు ఇది నిజంగానే ఊరటనిచ్చే వార్త. బ్యాంకు సంఘాలు, ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) మధ్య జరిగిన కీలక చర్చలు ఫలించడంతో సమ్మె నిర్ణయాన్ని అధికారికంగా వెనక్కి తీసుకున్నారు. దీంతో నేటి నుంచి బ్యాంకులు యథావిధిగా సేవలను అందించనున్నాయి.
అర్ధరాత్రి వరకు సాగిన చర్చలు.. మారిన నిర్ణయం
సమ్మెకు కేవలం కొన్ని గంటల ముందే ఊహించని పరిణామాలు చోటుచేసుకున్నాయి. సెప్టెంబర్ 27వ తేదీ రాత్రి 9:30 గంటలకు ఐబీఏ ప్రతినిధులు, యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యూఎఫ్‌బీ యూ) నేతలు అత్యవసరంగా సమావేశమయ్యారు. సుదీర్ఘంగా సాగిన ఈ చర్చల్లో ఇరువర్గాల మధ్య కీలక అంశాలపై సానుకూల వాతావరణంలో ఒప్పందం కుదిరింది. బ్యాంకుల లావాదేవీలకు ఎలాంటి అంతరాయం కలగకుండా ఉండాలనే ఉద్దేశంతో యూనియన్లు తమ సమ్మె అస్త్రాన్ని తాత్కాలికంగా పక్కనపెట్టాయి.

వారానికి ఐదు రోజులే పని దినాలు.. హైపవర్ కమిటీ ఏర్పాటు
బ్యాంక్ ఉద్యోగుల చిరకాల డిమాండ్ అయిన అన్ని శనివారాలను సెలవులుగా ప్రకటించాలనే అంశంపై ఇరువర్గాలు ఒక అంగీకారానికి వచ్చాయి. ప్రస్తుతం రెండో, నాల్గవ శనివారాలు మాత్రమే సెలవులు ఉండగా.. అన్ని శనివారాలను సెలవుదినాలుగా మార్చే ప్రతిపాదనపై చర్చించేందుకు ప్రత్యేకంగా ఒక హైపవర్ కమిటీని ఏర్పాటు చేయనున్నారు. ఈ కమిటీ కస్టమర్ల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, అందరికీ ఆమోదయోగ్యమైన ప్రత్యామ్నాయ మార్గాలపై కసరత్తు చేసి త్వరలోనే నిర్ణయం వెలువరించనుంది.
పీఎల్‌ఐ స్కీమ్, పెన్షన్ సమస్యలపై సానుకూల స్పందన
కేవలం శనివారాల సెలవులే కాకుండా, స్కేల్-4 ఆఫీసర్లకు సంబంధించిన పర్ఫార్మెన్స్ లింక్డ్ ఇన్సెంటివ్ (పీఎల్‌ఐ) స్కీమ్‌లో మార్పులపై కూడా చర్చలు జరిగాయి. ఉద్యోగుల సంఘాలు లేవనెత్తిన అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుని, ప్రభుత్వంతో చర్చించి తగిన సవరణలు చేసేందుకు అంగీకారం కుదిరింది. అలాగే గతేడాది మార్చి 8 నాటి చర్చల్లో పెండింగ్‌లో ఉన్న ఇతర డిమాండ్లు, జాతీయ పెన్షన్ విధానానికి (ఎన్‌పీఎస్) సంబంధించిన అంశాలను కూడా త్వరలోనే పరిష్కరించనున్నట్లు యూనియన్ నేతలు స్పష్టం చేశారు.
హాఫ్ ఇయర్లీ క్లోజింగ్ భయం దూరం
ఒకవేళ ఈ సమ్మె కనుక జరిగి ఉంటే సెప్టెంబర్ 28 నుంచి 30 వరకు బ్యాంకులు పూర్తిగా బంద్ అయ్యేవి. సరిగ్గా అదే సమయంలో సెప్టెంబర్ 30న హాఫ్ ఇయర్లీ క్లోజింగ్స్ ఉండటంతో బ్యాంకింగ్ రంగంపై తీవ్ర ప్రభావం పడేది. ఈ సంక్షోభాన్ని ముందే ఊహించి ఇరువర్గాలు పట్టువీడకపోవడంతో భారీ నష్టం తప్పింది. మొత్తానికి ఉద్యోగుల ప్రధాన డిమాండ్లపై చర్చలకు మార్గం సుగమం కావడంతో, సోమవారం నుంచి అన్ని బ్యాంకుల్లో లావాదేవీలు ఎలాంటి ఆటంకం లేకుండా సాగనున్నాయి.














Click it and Unblock the Notifications
