ఆ యూనివర్శిటీ మిడ్ టర్మ్ పరీక్షలు వాయిదా: నేటి నుంచి క్లాసులు బంద్
పంజాబ్ ఫగ్వారాలో ఉన్న లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ క్యాంపస్‌లో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. వర్సిటీ క్యాంపస్ లో ఓ విద్యార్థినిపై బయటి వ్యక్తి అత్యాచారం చేశాడనే ఆరోపణలతో తోటి విద్యార్థులు భారీ ఎత్తున హింసాత్మక నిరసనలకు దిగారు. ఈ నేపథ్యంలో యూనివర్శిటీ కీలక నిర్ణయం తీసుకుంది. నేటి నుంచి 10 రోజుల పాటు తరగతులను పూర్తిగా రద్దు చేసింది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది.
తరగతుల రద్దుతో పాటు మిడ్ టర్మ్ పరీక్షలు కూడా వాయిదా పడ్డాయి. తదుపరి నోటీస్ వెలువడేంత వరకు ఈ పరీక్షలను వాయిదా వేస్తోన్నట్లు వర్సిటీ వెల్లడించింది. విద్యార్థులందరి భద్రత, శ్రేయస్సును దృష్టిలో ఉంచుకునే ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు పేర్కొంది. ఈ 10 రోజుల కాలంలో విద్యార్థులు తమ స్వస్థలాలకు వెళ్లడానికి యాజమాన్యం అనుమతి ఇచ్చింది. వెళ్లలేని విద్యార్థులు హాస్టళ్లలోనే సురక్షితంగా ఉండాలని సూచించింది. దీనిపై మార్గదర్శకాలు జారీ చేసింది.

క్యాంపస్‌లోకి ప్రవేశించిన ఓ ప్లంబర్ విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడ్డాడని, దీనిపై హాస్టల్ వార్డెన్ స్పందించలేదని ఆరోపిస్తూ ఎల్పీయూ విద్యార్థులు శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత భారీ ఎత్తున నిరసనలు చేపట్టిన విషయం తెలిసిందే. అక్కడి ఫర్నిచర్ ను తగులబెట్టారు. అడ్మిన్ బిల్డింగ్ అద్దాలను పగులగొట్టారు. ఈ క్రమంలో విద్యార్థులు జాతీయ రహదారి-44ను సైతం స్తంభింపజేశారు. దీంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు ప్రయత్నించినప్పుడు ఘర్షణ తలెత్తింది.
నిరసనకారులు పోలీసులపై వాటర్ బాటిళ్ళు, రాళ్ళు రువ్వి, పలు పోలీస్ వాహనాలను ధ్వంసం చేసి నిప్పంటించారు. ఈ తీవ్ర గందరగోళ పరిస్థితిని అదుపు చేయడానికి కపుర్తలా, జలంధర్ రూరల్, హోషియార్‌పూర్ ప్రాంతాల నుంచి భారీగా పోలీస్ బలగాలను క్యాంపస్ వద్దకు రప్పించారు. జలంధర్ రేంజ్ డీఐజీ నవీన్ సింగ్లా మాట్లాడుతూ.. ఈ అత్యాచార వార్తలపై గుర్తుతెలియని వ్యక్తిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు.
దీనిపై విచారణ జరపడానికి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశామని, సీసీటీవీ ఫుటేజీలు, ఫోరెన్సిక్ ఆధారాల సహాయంతో నిజాలను వెలికితీస్తామని ఆయన మీడియాకు వెల్లడించారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా దాదాపు 15 రోజుల క్రితం క్యాంపస్‌లోనే ఆత్మహత్యకు పాల్పడిన తెలంగాణకు చెందిన ఒక విద్యార్థిని మృతి వ్యవహారాన్ని కూడా పరిశీలిస్తామని పోలీసులు ప్రకటించారు.
ఆదివారం రాత్రి పోలీసులు క్యాంపస్ లో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ప్రస్తుతం అక్కడ 2,000 మందికి పైగా పోలీసులను మోహరింపజేశారు. పరిస్థితులు అదుపులో ఉన్నాయని ఫగ్వారా అదనపు డీజీపీ ఫయాజ్ ఫారూఖీ తెలిపారు. శాంతిభద్రతలను పునరుద్ధరించామని, ఎవరూ ఆందోళన చెందనక్కర్లేదని అన్నారు. క్యాంపస్ పరిధిలో ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగలేదని ఎల్‌పీయూ రిజిస్ట్రార్ మౌనికా గులాటి చెప్పారు. అత్యాచార వార్తలను కొట్టిపారేశారు. ఇలాంటి పుకార్లను నమ్మవద్దని ఆమె కోరారు.













Click it and Unblock the Notifications
