నీళ్లు తాగితే బ్రెయిన్ స్ట్రోక్! నిమిషం కంటే తక్కువ నిద్ర.. జిరాఫీ ఒంట్లో ఇన్ని రహస్యాలా!
ఈ భూమ్మీద జీవవైవిధ్యం ఎంతో అద్భుతమైనది. కాళ్లతో నేలను తాకుతూ, తలతో మేఘాలను తాకేలా ఉండే జంతువు ఏదైనా ఉందంటే అది కచ్చితంగా జిరాఫీనే. సాధారణంగా ఒక జీవి భారీ శరీరంతో, ఎత్తుగా పెరుగుతుందంటే దానికి తగినట్లుగా శరీర నిర్మాణ నియమాలు మారిపోవాల్సిందే. కానీ, ప్రకృతి నిబంధనలనే తిరగరాస్తూ, గుండెను సైతం లెక్కచేయకుండా ఆకాశాన్ని ముద్దాడేలా సాగే జిరాఫీ ప్రయాణం ఒక అంతుచిక్కని వింత. దాని శరీరంలో ఇమిడి ఉన్న ఆశ్చర్యకరమైన విషయాలను ఒక్కసారి పరిశీలిస్తే ఎవరికైనా మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే.
గుండె కాదు.. హైడ్రాలిక్ మిషన్..
సుమారు 18 నుంచి 20 అడుగుల ఎత్తుండే జిరాఫీకి తలను పైకి ఎత్తాలంటే దాని గుండె ఎంత బలంగా కొట్టుకోవాలో ఊహించగలమా? దీని గుండె కేవలం ఒక మామూలు అవయవం కాదు, ఒక అత్యంత శక్తివంతమైన హైడ్రాలిక్ లాంటిది. సుమారు 11 కిలోల బరువుండే ఈ భారీ గుండె.. రెండు అడుగుల పొడవు ఉంటుంది. మనుషులతో పోలిస్తే మూడు రెట్లు ఎక్కువ బ్లడ్ ప్రెజర్ ఉత్పత్తి చేస్తుంది. లేకపోతే సుమారు రెండు మీటర్ల ఎత్తులో ఉన్న మెదడుకు రక్తం అందక జిరాఫీ కుప్పకూలిపోతుంది. ఆ ఎత్తును అందుకోవడానికి ప్రకృతి దానికో ప్రత్యేకమైన బ్లడ్ పంపింగ్ సిస్టమ్‌ను అమర్చింది.

తల కిందకు వంచితే బ్రెయిన్ బ్లాస్ట్ కావాల్సిందే.. కానీ!
జిరాఫీ నీళ్లు తాగాలన్నా, కిందికి వంగి మేత మేయాలన్నా తన పొడవాటి మెడను కిందికి దించాలి. అలా కిందికి వంచినప్పుడు గుండె పంపే హై-ప్రెజర్ రక్తం నేరుగా మెదడులోకి దూసుకెళ్తే, ఆ ఒత్తిడికి దాని మెదడులోని రక్తనాళాలు చిట్లిపోయి..బ్రెయిన్ స్ట్రోక్ రావాలి. కానీ జిరాఫీ విషయంలో అలా జరగదు. దాని మెడలో ఉండే ప్రత్యేకమైన రక్తనాళాల వ్యవస్థ, వాల్వ్‌లు కలిసి ఆ ప్రమాదకరమైన రక్తపోటును సమర్థంగా నియంత్రిస్తాయి. నీళ్లు తాగి మళ్లీ తలను పైకి ఎత్తినప్పుడు రక్తం అకస్మాత్తుగా కిందకి పడిపోకుండా వాల్వ్‌లు కాపాడతాయి. ఈ అద్భుతమైన బ్యాలెన్సింగ్ సిస్టమ్ ఇంజనీరింగ్ అద్భుతమనే చెప్పాలి.
నిద్రపోవడానికి అంత సీన్ లేదా? కేవలం నిమిషాల పాటే!
మనం రోజుకు ఎనిమిది గంటలు హాయిగా నిద్రపోతాం. కానీ అడవిలో క్రూరమృగాల బారిన పడకుండా ఉండాలంటే జిరాఫీకి ఆ లగ్జరీ లేదు. జిరాఫీలు రోజు మొత్తంలో కేవలం అరగంట నుంచి గంట మాత్రమే నిద్రపోతాయి. మిగితా జంతువులలా ఇవి నడుము వాల్చవు, నిలబడే నిద్రపోతాయి. అది కూడా కేవలం ఒకటి రెండు నిమిషాల చొప్పున. ఒకవేళ గాఢ నిద్రపోవాల్సి వస్తే కాళ్లను మడిచి కింద కూర్చుంటుంది, కానీ ఆ పొడవాటి మెడను మాత్రం వెనక్కి తిప్పి వీపుపై పెట్టుకుంటుంది. నిద్రలో కూడా శత్రువుల రాకను పసిగట్టే ఈ విచిత్రమైన అలవాటు దాని మనుగడకు ప్రధాన ఆధారం.
కాళ్లతో తంతే సింహమైనా పరారే!
చూడటానికి ఎంతో శాస్త్రీయంగా, అందంగా కనిపించే జిరాఫీని తక్కువ అంచనా వేస్తే ప్రాకాలకే ముప్పు వస్తుంది. అడవికి రాజైన సింహం సైతం జిరాఫీ జోలికి వెళ్లాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తుంది. జిరాఫీ తన పొడవాటి కాళ్లతో విసిరే ఒక్క తన్ను ఎలాంటి బలమైన జంతువునైన నేలకూల్చగలదు. దీని బలమైన డెక్కల దెబ్బకు సింహం దవడలు పగిలిపోవడం లేదా ప్రాణాలు కోల్పోవడం ఖాయం. అందుకే ఆకలితో అలమటిస్తున్న సింహాలు కూడా ఒంటరిగా ఉన్న బలమైన జిరాఫీపై దాడి చేయడానికి భయపడతాయి.
ఇరవై అంగుళాల అద్భుత నాలుక
జిరాఫీకి మరో ప్రధాన ఆకర్షణ దాని నాలుక. సుమారు 20 అంగుళాల పొడవుండే ఈ నాలుక రంగు నలుపు - నీలం కలగలిపి ఉంటుంది. ముళ్ల పొదల్లో ఉండే ఆకులను, లేత చిగుళ్లను సులువుగా పట్టుకుని లాగడానికి ఈ పొడవాటి నాలుక ఒక టూల్‌లా పనిచేస్తుంది. అంతేకాదు, ఆఫ్రికా ఎండల్లో ఆకులు తింటున్నప్పుడు నాలుక కాలిపోకుండా సూర్యుని యూవీ కిరణాల నుంచి రక్షించుకోవడానికి ప్రకృతి దానికి ఆ ప్రత్యేకమైన ముదురు రంగును ప్రసాదించింది. దీంతో వీటికి దాహం కూడా తక్కువే.
ఈ అద్భుతమైన శరీర నిర్మాణంతో జిరాఫీ మనకు ఒకటే నేర్పుతుంది.. పరిమితులు ఎంత పెద్దవైనా, ప్రకృతి ఇచ్చిన శక్తితో వాటిని ఎదుర్కొని బతకడమే నిజమైన జీవన సూత్రం అని! ఈ విచిత్రమైన జీవి గురించి తెలుసుకున్న తర్వాత మీకేమనిపించింది?














Click it and Unblock the Notifications
