టాలీవుడ్ హీరోలకు వరుస గాయాలు, ఆందోళనలో ఫ్యాన్స్ , అసలేం జరుగుతోంది?
సినిమా కోసం హీరోలు తమ ప్రాణాలను పణంగా పెడుతున్నారా? అసలు టాలీవుడ్‌లో ఏం జరుగుతోంది? వరుసగా స్టార్ హీరోలు ఎందుకు గాయాలపాలవుతున్నారు? ఇప్పటికే పవన్ కళ్యాణ్, నందమూరి బాలకృష్ణ, రామ్ చరణ్ వరుస గాయాలు, సర్జరీలు ఫ్యాన్స్ కు ఆందోళన కలిగిస్తుండగా, తాజాగా జూనియర్ ఎన్టీఆర్ కూడా షూటింగ్‌లో గాయపడటంతో ఫ్యాన్స్ తీవ్రంగా కలత చెందుతున్నారు. ఒకే సమయంలో ఇండస్ట్రీలోని కీలక నటులందరూ ఆసుపత్రుల పాలుకావడం వల్ల రూ. వందల కోట్ల బడ్జెట్‌లతో తెరకెక్కుతున్న పాన్-ఇండియా చిత్రాల షూటింగ్‌లు నిలిచిపోయి విడుదల తేదీలు కూడా మారిపోతున్నాయి.
అన్నీ ఈ ఏడాదిలోనే
ఈ ఏడాదిలోనే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాత గాయాలు, సుదీర్ఘ రాజకీయ ప్రచారాల వల్ల కుడి భుజానికి 'రోటేటర్ కఫ్' కండరాలు దెబ్బతినడంతో ముంబైలో శస్త్రచికిత్స చేయించుకున్నారు. అలాగే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ 'పెద్ది' సినిమా కోసం తీస్తున్న రెజ్లింగ్ సీక్వెన్స్‌లో కుడి మణికట్టు కార్టిలేజ్ దెబ్బతినడంతో కోయంబత్తూరులో సర్జరీ చేయించుకున్నారు. మరోవైపు బాలకృష్ణ 'NBK111' సినిమా ఫైట్ సీన్‌లో కాలు జారడంతో ఎడమ మోకాలి 'క్వాడ్రిసెప్స్ టెండన్' దెబ్బతిని హైదరాబాద్‌లో ఆపరేషన్ చేయించుకున్నారు. ఇక తాజాగా ఎన్టీఆర్ 'డ్రాగన్' యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్‌లో భుజానికి గాయం కావడంతో వైద్యులు 6 నుంచి 8 వారాల పాటు పూర్తి విశ్రాంతి సూచించారు. అయితే మూడు నెలల సమయం పడుతుందని కూడా అంటున్నారు.

గతంలో ప్రభాస్, అఖిల్
గతంలో కూడా 'బాహుబలి', 'సాలార్' రిస్క్ ఫైట్ల వల్ల ప్రభాస్ మోకాళ్లపై ఒత్తిడి పడి యూరప్‌లో మోకాలికి శస్త్రచికిత్స చేయించుకోగా, 'ఏజెంట్' స్టంట్స్ సమయంలో అఖిల్ అక్కినేని భుజం కండరాలు చిరిగి సుదీర్ఘ చికిత్స పొందారు. హీరోలు ఒరిజినాలిటీ కోసం డూప్ లేకుండా స్వయంగా రిస్క్ ఫైట్లు చేయడం, తక్కువ సమయంలో బాడీ ట్రాన్స్‌ఫార్మేషన్ల కోసం చేసే హార్డ్-కోర్ వర్కౌట్లు, రోజుకు 12-14 గంటల నిరంతర షూటింగ్‌ల వల్ల శరీరానికి విశ్రాంతి లేకపోవడం, పాత గాయాలను నిర్లక్ష్యం చేయడమే ఈ వరుస ప్రమాదాలకు ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికి ఇలాంటి ఘటనల వల్ల ఫ్యాన్స్ మాత్రం తమ హీరోలకు ఏం జరుగుతుందా? అని తెగ టెన్షన్ పడుతున్నారు.














Click it and Unblock the Notifications