శ్రావణమాసం స్పెషల్ ట్రైన్స్.. చర్లపల్లి నుండి కొల్లాం.. నాలుగు రాష్ట్రాల ప్రయాణికులకు పండుగే!
పండుగలు, పబ్బాలు ఏవైనా మనందరి కన్నా ముందు రెడీ అయ్యేది రైల్వే. పండుగలకు ప్రయాణాలు చేసే వారు ఎక్కడికి వెళ్ళాలన్నా ఇబ్బంది లేకుండా ఉండేలా రైల్వే అదనపు రైళ్ళను, ప్రత్యేక రైళ్ళను ఏర్పాటు చేస్తుంది. ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందిస్తుంది. ఈ క్రమంలో శ్రావణ మాసంలో పెరిగే ప్రయాణీకుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడే దక్షిణ మధ్య రైల్వే ప్రణాళికలు సిద్ధం చేస్తుంది.
నాలుగు రాష్ట్రాలకు ఉపయోగపడేలా చర్లపల్లి నుండి కొల్లాం వరకు ప్రత్యేక రైళ్ళు
చర్లపల్లి జంక్షన్ నుండి కేరళలోని కొల్లాం వరకు ప్రత్యేక రైళ్ళను నడిపించనున్నట్టు అధికారులు ప్రకటించారు. ఈ సర్వీసులు ఆగస్ట్ 14 నుండి సెప్టెంబర్ 5 వరకు శుక్ర, శని వారాలలో అందుబాటులో ఉంటాయి. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు మాత్రమే కాదు తమిళనాడు, కేరళ రాష్ట్రాల వారికి కూడా ఈ ప్రత్యేక రైళ్ళు ఉపయోగపడనున్నాయి.

శ్రావణ మాసంలో దక్షిణమధ్య రైల్వే ప్రత్యేక రైళ్ళు
శ్రావణమాసంలో వివాహాలు, గృహప్రవేశాలు, పండుగలు, అనేక ప్రత్యేక దినాలు ఉంటాయి. ఈ మాసంలోనే సోదర భావానికి ప్రతీకగా నిలిచే రాఖీ పండుగ కూడా వస్తుంది. ఈ నెలలో తిరుపతి, శ్రీశైలం, యాదాద్రి, వేములవాడ వంటి పుణ్య క్షేత్రాలకు వెళ్ళే భక్తుల తాకిడి పెరుగుతుంది. అంతేకాదు కుటుంబాలతో కలిసి ప్రయాణాలు చేసేవారి సంఖ్య పెరుగుతుంది. దీంతో దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్ళను ఏర్పాటు చేస్తుంది.
చర్లపల్లి నుండి కొల్లాం వైపు వెళ్ళే రైలు ఈ రూట్ లోనే
ట్రైన్ నెంబర్ 07195 చర్లపల్లి నుండి కొల్లాం వైపు వెళ్ళే రైలు ప్రతీ శుక్రవారం నడుస్తుంది. ఆగస్ట్ 14, 21,28, సెప్టెంబర్ 4 తేదీలలో ఈ సర్వీస్ అందుబాటులో ఉంటుంది. ఈ రైలు చర్లపల్లి నుండి బయలుదేరి బీబీనగర్, నల్గొండ, మిర్యాలగూడా మీదుగా, గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట స్టేషన్ లలో ఆగుతుంది.
ఈ ప్రాంతాల మీదుగా ప్రత్యేక రైలు
ఆ తర్వాత కాట్పాడి, జోలార్ పేట్టై, సేలం, ఈ రోడ్, తిరుప్పూర్, పొదనూరు మీదుగా పాలక్కాడ్, త్రిసూర్, అలువా, ఎర్నాకులం, కొట్టాయం, కాయంకుళం మీదుగా కొల్లాం చేరుకుంటుంది. రిటర్న్ రైలు 07196 కొల్లాం నుండి చర్లపల్లికి ప్రతీ శనివారం నడుస్తుంది. ఈ రైలు ఆగస్టు 15, 22, 29, సెప్టెంబర్ 5వ తేదీలలో నడుస్తుంది.
రిటర్న్ రైలు నడిచేది ఇలా
ఈ రైలు కొల్లాం నుండి కాయంకుళం, మావేలికర, చెంగాన్నూరు, కొట్టాయం, ఎర్నాకులం, అలువా, త్రిసూర్, పాలక్కాడ్ మీదుగా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఆగి చర్లపల్లికి చేరుకుంటుంది. ఈ ప్రత్యేక రైళ్ళు నాలుగు రాష్ట్రాల ప్రజలకు సౌకర్యవంతమైన ప్రయాణం అందించి, సాధారణ రైళ్ళపై భారం తగ్గించనున్నాయి.












Click it and Unblock the Notifications