24 వేల మంది పేదలకు ఇళ్ల పట్టాలు.. ముహూర్తం ఫిక్స్
పేదల సంక్షేమమే ధ్యేయంగా అడుగులు వేస్తున్న ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం మరో చారిత్రాత్మక ఘట్టానికి శ్రీకారం చుట్టింది. ప్రతి ఎన్నికల్లోనూ కేవలం హామీలకే పరిమితమై, ఏళ్ల తరబడి అపరిష్కృతంగా మిగిలిపోయిన విజయవాడ ఇళ్ల పట్టాల సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనుంది. దశాబ్దాల క్రితం ఎన్టీఆర్ హయాంలో ఇచ్చిన ఇళ్లకు ఇప్పుడు సంపూర్ణ హక్కులు కల్పిస్తూ క్రమబద్దీకరణ పట్టాలు అందించేందుకు ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది. ఈ నెల 30వ తేదీన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా విజయవాడ వేదికగా లబ్దిదారులకు ఈ పట్టాలను అందజేయనున్నారు.
విశాఖ స్ఫూర్తితో విజయవాడలో భారీ ప్రయోజనం
ఇటీవల విశాఖపట్నంలో పండుగ వాతావరణంలో వేలాది కుటుంబాలకు భూములపై సంపూర్ణ హక్కులు కల్పిస్తూ సీఎం చంద్రబాబు పట్టాలు అందించిన విషయం తెలిసిందే. అదే తరహాలో ఇప్పుడు విజయవాడలోనూ సుమారు 24,057 మంది పేద, మధ్యతరగతి కుటుంబాలకు మేలు జరిగేలా అడుగులు పడుతున్నాయి. ఎన్టీఆర్ జిల్లాలోని ఏడు నియోజకవర్గాలు, కృష్ణా జిల్లా గన్నవరం పరిధిలోని మొత్తం 8 నియోజకవర్గాల పరిధిలోని 15 మండలాల్లో ఈ పట్టాల పంపిణీ కార్యక్రమం అత్యంత వైభవంగా జరగనుంది. విజయవాడ తూర్పు, పశ్చిమ, సెంట్రల్ నియోజకవర్గాల పరిధిలోని కొండలపై ఇళ్లు నిర్మించుకుని దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న నివాసితుల కలలు నెరవేరబోతున్నాయి.

ఒక్కో కుటుంబానికి రూ. 40-45 లక్షల వరకు లబ్ది
ఈ క్రమబద్దీకరణ పట్టాల ద్వారా లబ్దిదారుల జీవితాల్లో కొత్త వెలుగులు నిండనున్నాయి. ప్రభుత్వం పంపిణీ చేయబోతున్న ఈ భూముల మార్కెట్ విలువ సుమారు రూ. 24,297 కోట్లుగా అంచనా వేయగా.. విజయవాడలో సుమారు రూ. 9,800 కోట్ల విలువైన భూమిపై లబ్దిదారులకు హక్కులు దక్కనున్నాయి. ఈ లెక్కన ఒక్కో కుటుంబానికి దాదాపు రూ. 40 నుంచి 45 లక్షల వరకు ఆర్థిక లబ్ది చేకూరనుంది. నగరంలోని కొండ ప్రాంతాల్లో నివసించే పేదలకు ఈ పట్టాలు రావడంతో వారి ఇళ్లకు శాశ్వత భద్రతతో పాటు భవిష్యత్తుకు పూర్తి భరోసా లభించినట్లవుతుంది.
నియోజకవర్గాల వారీగా లబ్దిదారుల వివరాలు
ఈ చారిత్రాత్మక పథకం ద్వారా అన్ని వర్గాల పేదలకు పెద్దపీట వేయడం విశేషం. బీసీలు 12,093 మంది, ఓసీలు 6,130 మంది, ఎస్సీలు 4,546 మంది, ముస్లిం బీసీలు 955 మంది, ఎస్టీలు 333 కుటుంబాలు ఈ లబ్దిని పొందనున్నాయి. నియోజకవర్గాల వారీగా చూస్తే..
- విజయవాడ తూర్పు: 7,990
- విజయవాడ పశ్చిమం: 7,465
- విజయవాడ సెంట్రల్: 5,815
- గన్నవరం: 602
- జగ్గయ్యపేట: 1,135
- మైలవరం: 981
- నందిగామ: 54
- తిరువూరు: 15 కుటుంబాలకు చొప్పున మొత్తం 24,057 మందికి సంపూర్ణ యాజమాన్య హక్కులు దక్కనున్నాయి.
617 ఎకరాల విస్తీర్ణంలోని 29.86 లక్షల చదరపు గజాల స్థలాన్ని క్రమబద్ధీకరించి పేదలకు అందిస్తున్న ఈ బృహత్తర కార్యక్రమం ద్వారా, దశాబ్దాల కాలంగా తమ సొంతింటి కలను సాకారం చేసుకున్న పేదవాడి కళ్లలో ఆనందం చూడటమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోంది.














Click it and Unblock the Notifications
