అమెరికాలో రోడ్డు ప్రమాదం.. తెలంగాణకు చెందిన మహిళ మృతి
అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తెలంగాణకు చెందిన మహిళ ప్రాణాలు కోల్పోయారు. సిగ్నల్ వద్ద ఆగిన కారును ఢీకొన్న మరోకారు ఢీ కొట్టిన నేపథ్యంలో ఈ దారుణమైన ఘటన జరిగినట్లు స్పష్టం అవుతోంది. మృతురాలు రంగారెడ్డి జిల్లా ఆమన్ గల్ మండలం ఆకుతోటపల్లి గ్రామానికి చెందిన శ్రీపాతి దీపారెడ్డి(44)గా పోలీసులు గుర్తించారు. ఆమె మృతి చెందిన విషయం తెలియడంతో ఆమన్ గల్ లో విషాద ఛాయలు అలుముకున్నాయి. మరోవైపు దీపారెడ్డి మృతి పట్ల స్థానిక నాయకులు సంతాపం తెలిపారు. అయితే ఆమె అంత్యక్రియలు అమెరికాలోనే నిర్వహించనున్నట్లు సమాచారం.
రంగారెడ్డి జిల్లా ఆమన్ గల్ మండలం ఆకుతోటపల్లికి చెందిన శ్రీపాతి దీపారెడ్డి.. భర్త రామకృష్ణారెడ్డితో కలిసి అమెరికాలోని న్యూ జెర్సీలో 20 ఏళ్లుగా నివాసం ఉంటున్నారు. వాళ్లిద్దరూ సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు కావడంతో అక్కడే స్థిరపడ్డారు. ఈ దంపతులకు ఇద్దరు కూతుళ్లు సంస్కృతి, హర్షిత ఉన్నారు. అయితే తాజాగా దీపారెడ్డి కారులో ప్రయాణిస్తూ న్యూ జెర్సీలోని సిగ్నల్ వద్ద ఆగిన సమయంలో మరో కారు వేగంగా వచ్చి ఢీ కొట్టింది. అయితే ఈ ప్రమాదంలో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఈ విషయాన్ని ఆమె కుటుంబ సభ్యులు ధ్రువీకరించారు.

ఇక దీపారెడ్డి అంత్యక్రియలు న్యూ జెర్సీలోనే నిర్వహించనున్నట్లు ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. ఇటీవల అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్ కు చెందిన ఒకే కుటుంబంలోని ముగ్గురు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. అమెరికాలోని సెయింట్ ఫ్రాన్సిస్ ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 45 ఏళ్ల నజేయా సల్మా, 19 ఏళ్ల కుమార్తె నేహా నహీం షేక్, 14 ఏళ్ల కుమారుడు ఉమర్ షేక్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన మరువక ముందే మరోసారి ఇలాంటి ప్రమాదం జరగడంపై ఆందోళన వ్యక్తం అవుతోంది.












Click it and Unblock the Notifications