చరిత్రలు సృష్టిస్తున్న ఇండియన్స్.. న్యూజిలాండ్ ఎంపీగా 18 ఏళ్ల తెలుగమ్మాయి..
ప్రపంచ దేశాల్లో ఇండియన్స్ తమ సత్తా చాటుతున్నారు. శక్తి సామర్థ్య లేమిటో ఆయా దేశాలకు రుచి చూపిస్తున్నారు. వృత్తి, ఉద్యోగం, వ్యాపారం,రాజకీయ రంగాల్లో చరిత్రలు సృష్టిస్తున్నారు . రంగం ఏదైనా టాప్ పొజిషన్‌నో దూసుకుపోతున్నారు. తాజాగా తెలుగమ్మాయికి అరుదైన గౌరవం దక్కింది. ఏకంగా 18 ఏళ్ల యువతి న్యూజిలాండ్ ఎంపీగా ఎంపికైయ్యారు.

ప్రకాశం జిల్లా అమ్మాయి.. న్యూజిలాండ్ ఎంపిగా..
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా, టంగుటూరు గ్రామానికి చెందిన గడ్డం మేఘన న్యూజిల్యాండ్ యూత్ పార్లమెంట్ సభ్యురాలిగా ఎంపికయ్యారు. ఇటీవల ఆ దేశ నామినేటెడ్ ఎంపీ పదవులకు ఎంపిక జరిగింది. ఈ నేపథ్యంలో 'సేవా కార్యక్రమాలు, యువత' విభాగానికి ప్రాతినిధ్యం వహించే పార్లమెంటు సభ్యురాలిగా 18 ఏళ్ల మేఘనను ఎంపిక చేశారు. వాల్కటో ప్రాంతం నుంచి ఎంపీగా ఆమెను ఎంపిక చేస్తున్నట్లు ప్రకటించారు.

'సేవా కార్యక్రమాలు, యువత' విభాగానికి ప్రాతినిధ్యం
యువతి మేఘన తల్లిదండ్రులు గడ్డం రవికుమార్, ఉష. ఉద్యోగ రీత్యా రవికుమార్ 2001లో న్యూజిలాండ్ వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. అక్కడే పుట్టి పెరిగిన మేఘన.. కేంబ్రిడ్జిలోని సెయింట్ పీటర్స్ ఉన్నత పాఠశాలలోనే తన విద్యాబ్యాసం పూర్తి చేశారు. తన చిన్న తనం నుంచే మేఘన సేవా కార్యక్రమాలు అలవర్చుకుంది.
తన తోటి స్నేహితులతో కలిసి విళారాలు సేకరించి.. వచ్చిన వాటిని అనాథ శరణాలయాలకు ఇస్తున్నారు. పలు దేశాల నుంచి న్యూజిలాండ్ కు వలస వచ్చిన శరణార్థులకు కనీసవసతులతో పాటు విద్య, ఆశ్రమం కల్పించడంలో మేఘన కీలక పాత్ర పోషించారు. సేవలను గుర్తించిన న్యూజిలాండ్ ప్రభుత్వం మేఘనను పార్లమెంటు సభ్యురాలిగా ఎంపిక చేసినట్లు ప్రకటించింది.

ఫిబ్రవరిలో ఎంపీగా మేఘన ప్రమాణస్వీకారం
గత డిసెంబర్ 16న జరిగి ఈ ఎంపిక విషయాన్ని ఆ ప్రాంతపు ప్రభుత్వ ఎంపీ టిమ్ నాన్ డిమోలిన్ మేఘన కుటుంబ సభ్యులకు తెలిపారు. యువతి సేవా కార్యక్రమాలను గుర్తించి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. ఫిబ్రవరిలో ఎంపీగా మేఘన ప్రమాణస్వీకారం చేయనున్నారు.
దేశంలో యువత ఎదుర్కొంటున్న సమస్యలపై తన గళాన్ని పార్లమెంటులో వినిపిస్తానని మేఘన తెలిపారు. న్యూజిలాండ్ పార్లమెంటుకు ఎంపీగా.. అందులోనూ చిన్న వయసులోనే మేఘన ఎంపిక కావడం తమ గ్రామానికే కాదు.. రాష్ట్రానికే గర్వకారణమంటున్నారు టంగుటూరు వాసులు..












Click it and Unblock the Notifications