పెనమలూరులో ఉద్రిక్తత.. మంత్రి జోగి రమేష్ తనయుడి హల్చల్; పోలీసుల లాఠీ చార్జ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనేక ప్రాంతాలలో దాడులకు, హింసాత్మక ఘటనలకు వేదికైంది. అధికార ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య దాడులు, ప్రతి దాడులు కొనసాగాయి. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా మాచర్ల, పుంగనూరు, తాడిపత్రి, రైల్వే కోడూరు, గన్నవరం వంటి చోట్ల ఉద్రిక్తత చోటు చేసుకోగా, తాజాగా పెనమలూరు నియోజకవర్గంలోనూ ఉద్రిక్తత చోటుచేసుకుంది.
పెనమలూరులో ఉద్రిక్తత
రాష్ట్ర మంత్రి జోగి రమేష్ పోటీ చేస్తున్న పెనమలూరు నియోజకవర్గంలోని ఉప్పులూరు లోని పోలింగ్ కేంద్రంలో మంత్రి జోగి రమేష్ తనయుడు జోగి రాజీవ్ అనుచరులతో హల్చల్ చేశాడు. వందలాది మంది కార్యకర్తలతో పోలింగ్ కేంద్రానికి జోగి రాజీవ్ చేరుకోవడంతో టిడిపి శ్రేణులు కూడా భారీగా మొహరించాయి. ఉప్పులూరు ప్రాథమిక పాఠశాల వద్ద ఇరువర్గాలు భారీగా చేరుకోవడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది.

లాఠీ చార్జ్ చేసిన పోలీసులు
దీంతో పోలీసులు ఇరు వర్గాలను అక్కడి నుండి పంపించే ప్రయత్నం చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారుతున్న క్రమంలో ఇరు వర్గాలను చెదరగొట్టడానికి పోలీసులు లాఠీచార్జి చేశారు. పెనమలూరు అసెంబ్లీ నియోజకవర్గం నుండి జోగి రమేష్ వైసిపి అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగారు. జోగి రమేష్ పైన టిడిపి కూటమి నుండి బోడే ప్రసాద్ పోటీలో ఉన్నారు.
గత ఎన్నికల్లో పెడన నుండి గెలిచిన జోగి రమేష్
అయితే ఇక్కడ ఈసారి ఎన్నికల్లో విజయం సాధించాలని ఇరు పార్టీలు హోరాహోరీగా ప్రచారం చేసి ఓటర్లలో పట్టు కోసం ప్రయత్నాలు చేశారు. గత ఎన్నికలలో పెడన నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా గెలుపొందిన జోగి రమేష్ వైసిపి ప్రభుత్వంలో రెండోసారి క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణలో రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
పెనమలూరులో గెలవాలని జోగి రమేష్ యత్నం
గత ఎన్నికల్లో పెనమలూరు నియోజకవర్గం నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచిన కొలను పార్థసారథి పార్టీకి రాజీనామా చేసి టిడిపిలో చేరడంతో పెనమలూరు వైసీపీ అభ్యర్థిగా జోగి రమేష్ పేరును వైయస్ జగన్ ఖరారు చేశారు. దీంతో పెనమలూరు లో ఎలాగైనా గెలవాలని ప్రయత్నం చేస్తున్న జోగి రమేష్ ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నాలు చేశారని టిడిపి నేతలు ఆరోపించారు.












Click it and Unblock the Notifications