విజయనగరం జిల్లాలో ఉద్రిక్తత.. భోగాపురం ఎయిర్ పోర్ట్ భూసేకరణ సర్వేను అడ్డుకున్న రైతులు
విజయనగరం జిల్లా భోగాపురం మండలం బైరెడ్డి పాలెం వద్ద భోగాపురం ఎయిర్ పోర్ట్ భూసేకరణ వ్యవహారంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. భూసేకరణ కోసం వచ్చిన అధికారులను రైతులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసు బందోబస్తు మధ్య అధికారులు భూసేకరణ కొనసాగిస్తున్నారు.

తమకు మాట మాత్రం చెప్పకుండా చేస్తున్న సర్వేను అడ్డుకున్న రైతులు
ఎయిర్ పోర్ట్ అప్రోచ్ రహదారికి కావాల్సిన 130 ఎకరాల భూసేకరణకు గతంలోనే అధికారులు నోటిఫికేషన్ జారీ చేశారు. అయితే రైతులు తమను కనీసం సంప్రదించకుండా భూసేకరణ చేయడానికి అధికారులు రావడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ భూములు ఇవ్వడానికి ఒప్పుకోబోమని తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు రైతులు. అధికారుల సర్వేను అడ్డుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. తమకు మాట మాత్రం చెప్పలేదని తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు .

భోగాపురం ఎయిర్ పోర్ట్ అభివృద్ధి నిర్ణయం తీసుకున్న జగన్
విశాఖ పరిపాలన రాజధాని గా ప్రకటించటంతో పాటుగా భోగాపురం ఎయిర్ పోర్టును త్వరగా నిర్మించడం కోసం ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. సీఎం జగన్ నిర్ణయానికి అనుగుణంగా ఆంధ్ర ప్రదేశ్ క్యాబినెట్ కూడా భోగాపురం ఎయిర్ పోర్టు నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. భోగాపురం ఎయిర్ పోర్ట్ అభివృద్ధి పనులను పీపీపీ విధానంలో జిఎంఆర్ సంస్థ కు అప్పగించారు. భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణానికి భూములను సేకరించి అందులో సుమారు 2200 ఎకరాలు జిఎంఆర్ కి ఎయిర్ పోర్టు నిర్మాణం కోసం ఇస్తారు.

జీఎంఆర్ సంస్థకు విమానాశ్రయ నిర్మాణ పనులు .. భూసేకరణకు అడ్డు పడుతున్న రైతులు
మిగతా ఐదు వందల ఎకరాలను ప్రభుత్వం తన ఆధీనంలో ఉంచుకునేలా కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే విమానాశ్రయ పనులు ప్రారంభించడానికి జిఎంఆర్ సంస్థ రంగం సిద్ధం చేసుకుంది. ఈ క్రమంలో అధికారులు భూసేకరణ చేయడానికి విజయనగరం జిల్లా భోగాపురం మండలం బైరెడ్డి పాలెం వద్దకు చేరుకోగా రైతులు అధికారులను అడ్డుకున్నారు. రైతులు అడ్డుకుంటున్నా అధికారులు భారీ సంఖ్యలో పోలీసు బందోబస్తు మధ్య భూసేకరణ కొనసాగిస్తున్నారు.












Click it and Unblock the Notifications