అమరావతిలో అదే టెన్షన్- చంద్రబాబు టూర్ వేళ వైసీపీ వర్సెస్ టీడీపీ వార్..!
రాజధాని అమరావతిలో టీడీపీ అధినేత చంద్రబాబు మూడు రోజుల టూర్ కు సిద్ధమయ్యారు. ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు చంద్రబాబు రాజధాని గ్రామాల్లో పర్యటించబోతున్నారు. రాజధాని పరిధిలోకి వచ్చే నియోజకవర్గాల్లో చంద్రబాబు పర్యటన ఈసారి ఉద్రిక్తతలకు కారణమవుతోంది. చంద్రబాబు టూర్ ను నిరసిస్తూ వైసీపీ నేతలు బహిరంగపోరుకు చేస్తున్న ప్రయత్నాలే ఇందుకు కారణం. ముఖ్యంగా వైసీపీ, టీడీపీ మధ్య ఫ్లెక్సీల వార్, సవాళ్లతో మొదలైన ఈ పోరు పతాకస్ధాయికి చేరుతోంది.
అమరావతిలో చంద్రబాబు పర్యటనను ఆహ్వానిస్తూ టీడీపీ నేతలు కట్టిన ఫ్లెక్సీల్ని వైసీపీ నేతలు తొలగించడం, పోటీగా చంద్రబాబు సిగ్గు సిగ్గు అంటూ ఫ్లెక్సీలు పెట్టడంతో ఇరువర్గాల మధ్య పోరు మొదలైంది. చంద్రబాబు టూర్ కు ఒక్క రోజు ముందే అమరావతి గ్రామాల్లో ఈ దృశ్యాలు కనిపించడం మొదలైంది. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా గట్టి బందోబస్తు ఏర్పాటు చేసి వారిని కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

అమరావతిలో ఈసారి ఎలాగైనా పాగా వేయాలని టీడీపీ ప్రయత్నిస్తుండగా.. మరోసారి గెలిచి మూడో రాజధానిపైనా తమకే పట్టు ఉందని నిరూపించుకునే ప్రయత్నాల్లో అధికార పార్టీ కనిపిస్తోంది. దీంతో ఫ్లెక్సీల వార్ తో మొదలైన పోరు ఇప్పుడు తీవ్రమవుతోంది. వరుసగా రెండోరోజు ఇవాళ కూడా అమరావతిలో పోలీసుల హడావిడి కనిపిస్తోంది. వైసీపీ, టీడీపీ వర్గాలు చంద్రబాబు టూర్ నేపథ్యంలో దాడులకు దిగే అవకాశాలున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

అమరావతిలో చంద్రబాబు టూర్ సందర్బంగా టీడీపీ కట్టిన ఫ్లెక్సీలను, పోటీగా వైసీపీ కట్టిన ఫ్లెక్సీల్ని పోలీసులు తొలగించారు. అయితే చంద్రబాబు ఫొటోలతో ఫ్లెక్సీలు తిరిగి పెట్టాలని టీడీపీ డిమాండ్ చేస్తోంది. దీంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీగా మోహరించారు. అలాగే చంద్రబాబు టూర్ మొదలైన తర్వాత వైసీపీ నుంచి దాడులు జరగకుండా ముందుగానే నేతలతో మాట్లాడుతున్నట్లు తెలుస్తోంది. గతంలో అమరావతిలో బీజేపీ నేత సత్యకుమార్ కాన్వాయ్ పై దాడి నేపథ్యంలో ఈసారి చంద్రబాబు టూర్ కూడా పోలీసులకు సవాల్ గా మారబోతోంది.
అమరావతిలో అదే టెన్షన్- చంద్రబాబు టూర్ వేళ వైసీపీ వర్సెస్ టీడీపీ వార్..!! pic.twitter.com/EgyH03cl7a
— oneindiatelugu (@oneindiatelugu) April 25, 2023












Click it and Unblock the Notifications