తల్లికి వందనం: 15వేలు ఇస్తామని 13వేలు ఇస్తారా? భారీ కోతలపై వైసీపీ ఫైర్ !
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈనెల 22వ తేదీ తల్లికి వందనం నిధులను విడుదల చేస్తామని ఏపీ ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ క్రమంలో విద్యార్థుల చదువుల కోసం ఇస్తున్న తల్లికి వందనం పథకం అమలులో కూటమి ప్రభుత్వం తల్లిదండ్రులను, విద్యార్థులను మోసం చేస్తుందని కాంగ్రెస్ పార్టీ నాయకులు టార్గెట్ చేస్తున్నారు.
చంద్రబాబుది అడుగడుగునా మోసం అంటున్న వైసీపీ
చంద్రబాబు తాను ఎన్నికలకు ముందు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీ అమలు విషయంలో విద్యార్థులను, తల్లిదండ్రులను మోసం చేస్తున్నారని, ప్రచార ఆర్భాటం తప్ప తల్లికి వందనంలో గత ప్రభుత్వం కంటే మెరుగ్గా ఇస్తుంది ఏదీ లేదని వైసీపీ టార్గెట్ చేస్తుంది. మాజీ ముఖ్యమంత్రి జగన్ అమ్మ ఒడి పేరుతో నాడు విద్యార్థులకు ప్రయోజనం చేకూర్చారని, చంద్రబాబులా మోసం చెయ్యలేదని వారన్నారు.

కోతపెట్టటంలో చంద్రబాబు దిట్ట
తల్లికి వందనంలో భారీ కోతలు విధించి విద్యార్థులు అందరికీ ఇస్తున్నట్టు కూటమి సర్కార్ చెప్పుకుంటుందని భగ్గుమన్నారు. ఒక్కొక్క విద్యార్థికి 15వేల రూపాయలు ఇస్తామని చెప్పి ఇప్పుడు ఆ హామీని తుంగలో తొక్కారని మండిపడ్డారు. ఈ ఏడాది తల్లికి వందనం కింద కేవలం 13 వేల రూపాయలు మాత్రమే వేయడం స్కూల్ నిర్వహణ ఫండ్ పేరుతో ప్రతి విద్యార్థి డబ్బుల నుండి 2000 రూపాయలు ముందస్తు కోత పెట్టడం చంద్రబాబు తీరుకు ఉదాహరణ అన్నారు.కోత పెట్టటంలో చంద్రబాబు దిట్టన్నారు.
చంద్రబాబు ఇస్తే ఇన్ని షరతులా
నాడు జగన్ పాలనలో అమ్మ ఒడిపై కావాలని రాద్ధాంతం చేసి, ఎన్నికల సమయంలో ఎటువంటి షరతులు లేకుండా అందరికీ ఇస్తామని చెప్పి ఇప్పుడు 14 రకాల కఠినమైన షరతులు నిబంధనలను తెరపైకి తెచ్చి విద్యార్థులను తల్లిదండ్రులను ఇబ్బంది పెడుతున్నారని వైసిపి భగ్గుమంది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 20 లక్షల మంది విద్యార్థులు ఈ పథకానికి దూరం కాబోతున్నారని సోషల్ మీడియా వేదికగా వైసిపి పోస్ట్ చేసింది.
చంద్రబాబుకు వైసీపీ సూటి ప్రశ్న
ఏపీ ప్రభుత్వ లెక్కల ప్రకారం 83లక్షల మంది విద్యార్థులు ఉంటే 67లక్షల మందికి ఇవ్వడం విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు చేస్తున్న అన్యాయం అని మండిపడ్డారు.ఇచ్చే 15 వేలల్లో కోతలు లేకుండా జమ చేస్తామని 2 వేలు కోత పెట్టడంపై సమాధానం చెప్పాలని వైసీపీ ప్రశ్నించింది. 300 యూనిట్లు విద్యుత్, పొలాలు, కార్లు అంటూ కొర్రీలు పెట్టడం వెనుక ఆంతర్యం ప్రజలకు తెలుసన్నారు.












Click it and Unblock the Notifications