తిరుమలలో రేపు ఉత్సవాలు
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. గురువారం నాడు 67,223 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 24,549 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 4.66 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది.
వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో అన్ని కంపార్టుమెంట్లు నిండిపోయాయి. ట్రావెలర్స్ బంగళా వరకు క్యూలైన్ ఏర్పడింది. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వ దర్శనానికి 18 నుంచి 20 గంటల సమయం పట్టింది. కంపార్ట్‌మెంట్లు, క్యూ లైన్‌లల్లో ఉన్న వారికి టీటీడీ సిబ్బంది అన్నప్రసాదాలు, మజ్జిగ, మంచినీరు, అల్పాహారాన్ని పంపిణీ చేశారు.

ఈ నెల 21వ తేదీన తిరుమల పెద్దజీయర్‌స్వామివారి సారథ్యంలో చాతుర్మాస దీక్ష సంకల్పం కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించడానికి టీటీడీ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. శ్రావణం, భాద్రపదం, ఆశ్వయుజ, కార్తీక మాసాలలో చాతుర్మాస దీక్షలను స్వీకరిస్తుంటారు.
వ్యాస/గురు పూర్ణిమ మరుసటి రోజు నుంచి ఈ చాతుర్మాస దీక్ష సంకల్పానికి పూనుకోవడం విశేషంగా భావిస్తారు. ఈ సందర్భంగా తిరుమల క్షేత్ర సాంప్రదాయాన్ని పాటిస్తూ ముందుగా పెద్దజీయర్ స్వామివారు తిరుమల బేడి ఆంజనేయస్వామివారి ఆలయం సమీపంలో ఉన్న జీయంగారి మఠం నుంచి చిన్నజీయర్, శిష్యలతో కలిసి వరాహస్వామి ఆలయం, పుష్కరిణిని సందర్శిస్తారు.
అనంతరం శ్రీవారి ఆలయానికి విచ్చేస్తారు. శ్రీవారి ఆలయ మహాద్వారం వద్ద టీటీడీ కార్యనిర్వాహణాధికారి, ఇతర ఆలయ అధికారులతో కలిసి వారిని సాదరంగా స్వామివారి దర్శనానికి ఆహ్వానిస్తారు. శ్రీవారి దర్శనానంతరం ఆలయ ప్రాంగణంలో ఉన్న రంగనాయకులవారి మండపంలో పెద్దజీయర్ స్వామికి మేల్‌చాట్ వస్త్రం, చిన్నజీయర్ స్వామికి నూలు చాట్ వస్త్రాన్ని బహూకరిస్తారు.
అదే రోజున గురు పౌర్ణమి సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో పౌర్ణమి గరుడసేవ ఉత్సవాలు జరుగనున్నాయి. ప్రతినెలా పౌర్ణమి పర్వదినాన టీటీడీ గరుడ సేవ నిర్వహిస్తున్న విషయం విదితమే. ఇందులో భాగంగా సాయంత్రం 7 నుంచి 9 గంట వరకు సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు గరుడునిపై తిరుమాడ వీధులలో విహరిస్తారు. భక్తులను కటాక్షిస్తారు.












Click it and Unblock the Notifications