పార్లమెంట్, ఏపీకి ముందస్తు ఎన్నికలు - ఢిల్లీ సంకేతాలు, కలిసొచ్చేదెవరికి..!?
దేశ వ్యాప్తంగా అయిదు రాష్ట్రాల ఎన్నికలు పూర్తయ్యాయి. మూడు రాష్ట్రాల్లో బీజేపీ విజయం సాధించింది. దీంతో కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. పార్లమెంట్ కు ఏప్రిల్ - మేలో జరగాల్సిన ఎన్నికలను ముందస్తుగా నిర్వహించే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. అదే జరిగితే పార్లమెంట్ తో పాటుగా ఏపీ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. పార్లమెంట్ తో ఏపీ ఎన్నికలు ఉంటాయని ఇప్పటికే సజ్జల స్పష్టత ఇచ్చారు. దీంతో..రాజకీయంగా ఉత్కంఠ మొదలైంది.
తెర మీదకు కొత్త లెక్కలు
తాజాగా జరిగిన అయిదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ మూడు రాష్ట్రాల్లో గెలిచింది. గెలుపు జోష్ లో ఉన్న బీజేపీ ఇక కేంద్రంలో అధికారం నిలబెట్టుకొనే వ్యూహాలకు పదును పెడుతోంది. ఈ జోష్ తగ్గకముందే ఎన్నికలకు వెళ్లటం ద్వారా ప్రయోజనం ఉంటుందని భావిస్తోంది. తెలంగాణలోనూ గతం కంటే బీజేపీ పుంజుకుంది.

కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల నాటి కంటే మెరుగైన స్థానంలో ఉన్నామని పార్టీ నేతలు చెబుతున్నారు. ఉత్తరాదిన దాదాపు కాంగ్రెస్ అడ్రస్ గల్లంతు అయింది. దక్షిణాదిన ప్రస్తుతం రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఈ లెక్కలు..మారుతున్న సమీకరణాల వేళ ముందస్తు దిశగా బీజేపీ అగ్రనాయకత్వం అడుగులు వేస్తున్నట్లు సమాచారం అందుతోంది.
ఒకేసారి ఎన్నికలు
పార్లమెంట్ ఎన్నికలతో పాటుగానే ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. దీంతో, మార్చిలో నోటిఫికేషన్ ఏప్రిల్ చివర్లో ఎన్నికలు ఉంటాయని ఏపీలోని ప్రధాన పార్టీల నేతలు అంచనా వేస్తున్నారు. కానీ, ఢిల్లీ కేంద్రంగా మారుతున్న లెక్కలతో ముందస్తుగానే ఫిబ్రవరి రెండో వారంలోనే ఎన్నికలకు అవకాశం ఉందని ఢిల్లీ పొలిటికల్ సర్కిల్స్ లో ప్రచారం మొదలైంది.
ఈ మధ్య కాలంలోనే పార్టీ ముఖ్య నేత సజ్జల సైతం పార్లమంట్ ఎన్నికలు ఎప్పుడు జరిగితే అప్పుడు ఏపీ ఎన్నికలు ఉంటాయని తేల్చి చెప్పారు. పార్లమెంట్ కు షెడ్యూల్ ప్రకారమా లేక ముందస్తు జరుగుతాయా అనేది చూడాల్సి ఉందన్నారు. దీని ద్వారా ఢిల్లీ నుంచి ముందస్తు పైన సంకేతాలు ఉన్నట్లు పార్టీలో చర్చ జరిగింది. ఇక, ఇప్పుడు తాజాగా ఎన్నికలు జరిగిన రాష్ట్రాల ఫలితాల తరువాత బీజేపీ నాయకత్వం తాజా ఆలోచన ఏంటనేది స్పష్టత వస్తోంది.
ఎవరికి కలిసొచ్చేను
ఏపీలో ముందస్తుగా ఎన్నికలు వస్తే ఎవరికి మేలు జరుగుతుందనేది చర్చగా మారుతోంది. సీఎం జగన్ తన గెలుపు పైన ఇప్పటికే ధీమాగా ఉన్నారు. సంక్షేమం తనను గెలిపిస్తుందనే నమ్మకంతో ఉన్నారు. ఇప్పటికే పార్టీ శ్రేణులను ప్రజల మధ్యకు పంపారు. టీడీపీ, జనసేన పొత్తు ఖరారు అయిన తరువాత భవిష్యత్ కార్యాచరణ పైన రెండు పార్టీల అధినేతలు మంతనాలు చేస్తున్నారు.
తమతో బీజేపీ కలిసి వస్తుందా లేదా అనేది రెండు పార్టీలకు ఇంకా స్పష్టత లేదు. బీజేపీ నిర్ణయం తరువాతనే ఈ రెండు పార్టీలు స్పష్టమైన వైఖరితో ముందుకు వెళ్లే అవకాశం ఉంది. ఈ సమయంలోనే ముందస్తు ఎన్నికల పైన ప్రచారం ప్రారంభం కావటంతో ఇప్పుడు రాజకీయంగా ఏపీలో సమీకరణాలు మారే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications