పదేళ్ల తరువాత రికార్డు ఉష్ణోగ్రతలు - ఈ జిల్లాలకు బిగ్ అలర్ట్..!!
తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు కొనసాగుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పలు జిల్లాలు నిప్పులకొలిమిని తలపిస్తున్నాయి. ఎన్నడూ లేనంతగా రికార్డ్ స్థాయిలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదౌతున్నాయి. ఇప్పటికే 46 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు మరో 4 రోజుల్లో 49కి చేరొచ్చని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నెలాఖరు వరకు వడగాల్పుల తీవ్రత కొనసాగుతుందని హెచ్చరిస్తున్నారు.
రికార్డు స్థాయిలో
ఏపీలో ఎండలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పెరిగిపోతుండడంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. మధ్యాహ్నం బయటకు రావాలంటే జంకుతున్నారు. బుధవారం పల్నాడు జిల్లా కొప్పునూరులో అత్యధికంగా 46.2 డిగ్రీల సెల్సీయస్ ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. తిరుపతి జిల్లాలోని మంగనెల్లూరులో 46, ఎన్టీఆర్ జిల్లా చిల్లకల్లులో 45.8 డిగ్రీలు, నంద్యాల జిల్లా బనగానపల్లె, నెల్లూరు జిల్లా మర్రిపాడులో 45.7 డిగ్రీల ఉష్ణోగ్రతతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.

పదేళ్ల తరువాత
చిత్తూరు జిల్లా కొత్తపల్లిలో 45.6, ప్రకాశం జిల్లా ఎండ్రవల్లిలో 45.5, కడప జిల్లా సింహాద్రిపురంలో 44.9, బాపట్ల జిల్లా వల్లపల్లిలో 44.6 , అనకాపల్లి జిల్లా దేవరపల్లిలో 44.5, కర్నూలు జిల్లా పంచలింగాలలో 44 డిగ్రీల టెంపరేచర్ నమోదు అయ్యింది . రాష్ట్రంలోని 21 జిల్లాలో 43 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు కావడం విశేషం. రేపు కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలోని 265 మండలాల్లో వడగాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఏప్రిల్ 30వ తేదీ ఉష్ణోగ్రతల్లో పదేళ్ల కాలంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాబోయే 4 రోజుల్లో ఎండ తీవ్రత కొనసాగుతుందని, వడగాలులు వీస్తాయని వాతావరణశాఖ హెచ్చరించింది.
ఐఎండీ హెచ్చరిక
ఎండల తీవ్రత కారణంగా పిల్లలు, గర్భిణీ స్త్రీలు, వృద్ధులు బయటకు వెళ్లొద్దని వైద్యులు సూచిస్తున్నారు. వడదెబ్బ బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు. మంచినీళ్లు, మజ్జిగ, ఓఆర్‌ఎస్ అందుబాటులో ఉంచుకోవాలని సూచిస్తున్నారు. అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. పల్నాడు తో పాటుగా రాయలసీమ జిల్లాల్లోనూ వడగాల్పుల తీవ్రత పెరిగింది. ఈ నెలాఖరు వరకు ఇదే తరహాలో ఎండ తీవ్రత కొనసాగుతుందనే హెచ్చరికలతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.












Click it and Unblock the Notifications