కాటు వేసే పామునైనా నమ్మొచ్చు గానీ..: షర్మిల కాంగ్రెస్‌పై సాయిరెడ్డి నిప్పులు
YS Sharmila: మొన్నటివరకూ తెలంగాణ రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించిన వైఎస్ షర్మిల.. ఏపీలో కొత్త ప్రయాణం మొదలు పెట్టారు. ఏపీ కాంగ్రెస్ అధినేత్రిగా బాధ్యతలను స్వీకరించబోతోన్నారు. విజయవాడ కానూరులో ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాలులో ఏపీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలను స్వీకరించనున్నారు.
అంతకంటే ముందు- ఆమె తన సొంత జిల్లాకు వెళ్లారు. ఇడుపులపాయను సందర్శించారు. తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఘాట్ వద్ద నివాళి అర్పించారు. ఆమె వెంట- మాజీ ఎంపీ కేవీపీ రామచంద్ర రావు, మాజీ మంత్రులు ఎన్ రఘువీరారెడ్డి, సాకే శైలజానాథ్, రాజంపేట లోక్‌సభ ఇన్‌ఛార్జ్ డాక్టర్ నర్రెడ్డి తులసీరెడ్డి, మాజీ ఎమ్మెల్యే అహ్మదుల్లా సహా పలువురు నాయకులు ఉన్నారు.

వైఎస్ షర్మిల బాధ్యతలను స్వీకరించబోతున్న వేళ.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వీ విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు. ఘాటు విమర్శలను సంధించారు. పలు ఆరోపణలను గుప్పించారు. గత వైభవాన్ని గుర్తు చేస్తూనే కాంగ్రెస్ పార్టీని పాముతో పోల్చారు.
2004, 2009లో కేంద్రంలో కాంగ్రెస్ సారథ్యంలో ప్రభుత్వం ఏర్పాటు కావడం వెనుక ఉమ్మడి ఏపీ.. అత్యంత కీలకంగా వ్యవహరించిందని సాయిరెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేశారు. అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి హాయంలో ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ సాధించిన లోక్‌సభ స్థానాల గురించి పరోక్షంగా వివరించారు.
ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదని సాయిరెడ్డి వ్యాఖ్యానించారు. ఏపీ- కాంగ్రెస్ పార్టీకి చేసిన మేలును గుర్తించకుండా ప్రజా వ్యతిరేక నిర్ణయాలను తీసుకుందని, ఇచ్చిపుచ్చుకునే సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. ఏపీ డిమాండ్లు, అవసరాలను కాంగ్రెస్ ఏనాడూ పట్టించుకోలేదని విమర్శించారు.
కాంగ్రెస్ నుంచి ఏపీ ప్రజలు గుణపాఠం నేర్చుకున్నారని, అన్ని విధాలుగా తమను మోసగించిన ఆ పార్టీని ఎప్పటికీ విశ్వసించబోరని తేల్చి చెప్పారాయన. ఒక్కోసారి ఏపీ ప్రజలు పామును అయినా నమ్ముతారేమో గానీ కాంగ్రెస్‌ను మాత్రం ఎప్పటికీ విశ్వసించరని స్పష్టం చేశారు సాయిరెడ్డి.












Click it and Unblock the Notifications