ప్రపంచంలో అత్యంత ధనవంతుడైన తెలుగు వ్యక్తి
దివిస్ ల్యాబ్స్ గురించి తెలుగువారికి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరంలేదు. ఎందుకంటే అది స్థాపించిన వ్యక్తి ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరిలోకి అత్యంత ధనవంతుడైన వ్యక్తిగా నిలిచారు. రూ.250 జీతానికి పనిచేసిన వ్యక్తి రూ.1.53 లక్షల కోట్ల విలువైన కంపెనీని స్థాపించారు. విజయవాడకు సమీపంలోని కంకిపాడుకు దగ్గరలో ఉండే మంతెన గ్రామంలో జన్మించిన డాక్టర్ దివి మురళీకృష్ణ ప్రసాద్ ప్రారంభంలో చదువులో పెద్దగా రాణించలేదు. ఎలాగోలా పదోతరగతి పూర్తిచేసి బందరులో ఇంటర్ చదివారు. అక్కడ ఇంటర్ రెండో సంవత్సరం ఫెయిలయ్యారు. ఎలాగోలా కష్టపడి ఇంటర్ ను పూర్తిచేశారు.
ఎలాగోలా చదువులో గట్టెక్కి
తర్వాత కర్ణాటకలోని మణిపాల్ అకాడమీ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్‌లో బీఫారస్మసీ కోర్సులో చేరారు. అక్కడ కూడా పెద్దగా చదువు అబ్బలేదు. మొదటి సంవత్సరం సబ్జెక్టులన్నీ ఉత్తీర్ణుడవ్వాలంటే నానా తిప్పలు పడాల్సి వచ్చింది. చివరకు బీఫార్మసీ కోర్సు పూర్తయ్యేసరికి విశ్వవిద్యాలయంలో టాపర్ గా నిలిచి బంగారు పతకం సాధించారు. అదే విశ్వవిద్యాలయంలో ఎంఫార్మసీ కూడా బంగారు పతకంతోనే పూర్తిచేశారు. అక్కడినుంచి హైదరాబాద్ వచ్చి వార్నర్ హిందూస్థాన్ అనే కంపెనీలో చేరారు. అక్కడ రూ.250 జీతం ఇచ్చేవారు. అక్కడ చేస్తూనే కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి ఫార్మాస్యూటికల్స్ సైన్సెస్ లో పీహెచ్ డీ పూర్తిచేసి డాక్టరేట్ అందుకున్నారు.

అమెరికా నుంచి తిరిగివచ్చి..
ఇక్కడ ఉద్యోగం బోరు కొట్టడంతో రూ.600 పట్టుకొని అమెరికా వెళ్లారు. ఏడు సంవత్సరాలు వివిధ కంపెనీలో పనిచేశారు. తర్వాత అమెరికా వద్దనుకొని భారత్ తిరిగివచ్చేశారు. ఫార్మా కంపెనీ పెట్టడానికి చేతిలో డబ్బులు లేవు. దీంతో డాక్టర్ రెడ్డీస్ అధినేత డాక్టర్ అంజిరెడ్డితో కలిసి కెమినార్ డ్రగ్స్ అనే ఫార్మా కంపెనీని కొనుగోలు చేసి విస్తరించారు. తర్వాత 1990లో 100 మంది ఉద్యోగులతో దివీస్ రెసెర్చి సెంటర్ ప్రయివేట్ లిమిటెడ్ పేరుతో కంపెనీని ఏర్పాటు చేశారు.
ఫార్మా కంపెనీలకు అవసరమైన సాంకేతికత, కన్సల్టెన్సీ సేవలు అందించేవారు. ఫార్మా కంపెనీలకు ముడి పదార్థాలైన ఏపీఐ తయారు చేయడం కోసం 1994లో చౌటుప్పల్ దగ్గర దివీస్ లేబొరేటరీస్ పేరుతో ప్లాంట్ ఏర్పాటు చేశారు. ప్రపంచంలోని టాప్ 10 ఫార్మా కంపెనీల్లో 8 కంపెనీలు దివీస్ నుంచే ఏపీఐని దిగుమతి చేసుకుంటున్నాయి. చౌటుప్పల్‌తో పాటు విశాఖపట్నం సమీపంలోని చిప్పాడ వద్ద, కాకినాడ సమీపంలోని ఒంటిమామిడి వద్ద ఏపీఐ ప్లాంట్లు ఉన్నాయి. కంపెనీ షేర్ల మార్కెట్ క్యాప్ రూ.1.53 లక్షల కోట్లకు చేరింది.












Click it and Unblock the Notifications