తిరుపతిలో శ్రీవారి సారె ఊరేగింపు ట్రయల్ రన్
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు నవంబరు 17 నుండి 25వ తేదీ వరకు జరుగనున్నాయి. 17న ధ్వజారోహణం చేస్తారు. అనంతరం అమ్మవారిని చినశేషవాహనంపై ఊరేగిస్తారు. 18 పెద్దశేషవాహనం, హంసవాహనం, 19న ముత్యపు పందిరి, సింహవాహనం, 20న కల్పవృక్ష వాహనం, హనుమంత వాహనం, 21న పల్లకీ ఉత్సవం, గజవాహనం, 22న సర్వభూపాల వాహనం, స్వర్ణ రథోత్సవం, గరుడవాహన సేవలను నిర్వహిస్తారు. 23 సూర్యప్రభ, చంద్రప్రభ వాహనం, 24న రథోత్సవం, అశ్వ వాహనం, 25న పంచమీతీర్థం ధ్వజావరోహణ కార్యక్రమాలు ఉంటాయి.
దీనికి సంబంధించిన ఏర్పాట్లను టీటీడీ అధికారులు పరిశీలించారు. అమ్మవారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను నవంబర్ 15 నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని భక్తుల రద్దీ నేపథ్యంలో ముందస్తుగా విస్తృతంగా ఏర్పాట్లు చేపట్టాలని అన్నారు. పద్మ సరోవరం, నాలుగు మాడ వీధులు, తోళప్ప గార్డెన్స్, ఫ్రైడే గార్డెన్స్, ఎగ్జిబిషన్ ప్రాంతం, ఉద్యానవన ప్రదర్శన శాల, జిల్లా పరిషత్ హైస్కూల్, పూడి హోల్డింగ్ పాయింట్, నవజీవన్ ప్రాంతాలను పరిశీలించారు.

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలలో చివరి రోజైన నవంబరు 25న పంచమీ తీర్థం సందర్భంగా తిరుమల నుండి వచ్చే శ్రీవారి సారె ఊరేగింపు ట్రయల్ రన్ గురువారం విజయవంతంగా నిర్వహించారు. తిరుపతిలోని చెన్నారెడ్డి కాలనీలో గల శ్రీ వినాయక స్వామివారి ఆలయం నుండి శ్రీవారి సారె ఊరేగింపు ట్రయల్ రన్ మొదలైంది. అక్కడి నుండి ఏనుగుపై సారెను ఊరేగింపుగా తీసుకొచ్చారు.
ముందుగా శ్రీ కోదండరామాలయం, చిన్నబజారు వీధి, పాత హుజుర్ ఆఫీస్, శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం, శ్రీ ఆంజనేయస్వామివారి ఆలయం, బండ్ల వీధి, ఆర్‌టిసి బస్టాండు, పద్మావతి పురం, మార్కెట్ యార్డు, శిల్పారామం మీదుగా తిరుచానూరులోని పసుపు మండపం వద్దకు చేరుకున్నారు. అక్కడి నుండి శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం వద్దకు చేరుకుని మాడ వీధుల గుండా పుష్కరిణి వద్దగల మండపానికి సారెను వేంచేపు చేశారు. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో నవంబరు 11వ తేదీన కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం చేపడతారు.












Click it and Unblock the Notifications