Tirumala: లడ్డూ వివాదం, కేంద్ర ప్రభుత్వం ఎంట్రీతో మైండ్ బ్లాక్, షోకాజ్ నోటీసులు
తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామి లడ్డూ ప్రసాదం కల్తీపై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ చాలా సీరియస్ అయ్యింది. తిరుమల లడ్డూల తయారి కోసం సరఫరా చేసే నెయ్యి తయారీలో నాణ్యతా ప్రమాణాలు పాటించని తమిళనాడుకు చెందిన ఏఆర్ కంపెనీకి కేంద్ర ప్రభుత్వం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. తమిళనాడుకు చెందిన ఏఆర్ కంపెనీకి కేంద్ర ప్రభుత్వం నోటీసులు ఇవ్వడంతో ఇప్పుడు ఈ వివాదం కొత్త మలుపు తిరిగింది.
తిరుమల లడ్డూ ప్రసాదం వివాదం నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ విచారణ చేపట్టింది. ఈ క్రమంలో శ్రీవెంకటేశ్వర స్వామి వారి లడ్డూ ప్రసాదం తయారీకి నెయ్యి సరఫరా చేసే నాలుగు కంపెనీలకు చెందిన నెయ్యి నమూనాలను కేంద్ర ప్రభుత్వం సేకరించింది. ఈ మేరకు ఆ నెయ్యి నాణ్యతపై పరీక్షలు నిర్వహించింది. వాటిలో తిరుమలకు నెయ్యి పరఫరా చేసిన మూడు కంపెనీలు సరైన ప్రమాణాలు పాటించినట్లు కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య శాఖ గుర్తించింది.

అయితే తమిళనాడుకు చెందిన ఏఆర్ కంపెనీ మాత్రం నెయ్యి నాణ్యతా పరీక్షల్లో ఫెయిల్ అయ్యిందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఈ మేరకు సరైన ప్రమాణాలు పాటించకుండా కల్తీ నెయ్యి తిరుమల శ్రీవారి లడ్డూలు తయారు చెయ్యడానికి సరఫరా చేస్తున్న ఆ కంపెనీకి ఫుడ్ స్టాండర్డ్స్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ విషయంపై ఏఆర్ కంపెనీ యాజమాన్యం ఎలా స్పందిస్తుంది, ఏం చెబుతుంది అంటూ కోట్లాది మంది శ్రీవారి భక్తులు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు.
కమీషన్ల కోసం కక్కుర్తిపడిన వైసీపీ నాయకులు తిరుమలకు నెయ్యి సరఫరా చెయ్యడానికి కాంట్రాక్టులు ఇచ్చారని కూటమి ప్రభుత్వంలోని పలువురు నాయకులు ఆరోపిస్తున్నారు. అప్పటి టీటీడీ బోర్డుకు చెందిన కొందరు నెయ్యి కాంట్రాక్టులతో కుమ్మక్కు అయ్యారని టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులతో పాటు ప్రజలు కూడా ఆరోపిస్తున్నారు. ఇలాంటి సమయంలో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ జోక్యం చేసుకుని నెయ్యి నమూనాలు సేకరించి వాటిని పరీక్షించి ఏఆర్ కంపెనీకి షోకాజ్ నోటీసులు ఇవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.












Click it and Unblock the Notifications