మెడలో బంగారు గొలుసులు వేసుకుని తిరుగుతున్నారా?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బంగారానికి భద్రత లేకుండా పోయింది. ప్రస్తుతం బంగారం ధరలు చుక్కలను తాకుతున్న సమయంలో బంగారం కొనుగోలు చేయాలంటేనే పేద, మధ్యతరగతి ప్రజలు భయపడుతున్నారు. ఉన్న బంగారాన్ని కాపాడుకుంటే చాలని ఫీల్ అవుతున్నారు. అయితే బంగారాన్ని మెడలో వేసుకునీి రోడ్లమీదకి వెళితే రక్షణ లేకుండా పోతుందని ఏపీలో మహిళలు వాపోతున్నారు. ముఖ్యంగా తిరుపతి, తూర్పుగోదావరి జిల్లాలలో చైన్ స్నాచింగ్ బాధితులు లబోదిబోమంటున్నారు.
ఏపీలో చైన్ స్నాచింగ్ ముఠాలు
ఇటీవల కాలంలో తిరుపతి, తూర్పుగోదావరి జిల్లాలలో చైన్ స్నాచింగ్ ముఠాలు రెచ్చిపోతున్నారు. ఒక్కరోజు వ్యవధిలో రెండు జిల్లాలలో వరుస ఘటనలకు పాల్పడి స్థానికులకు, మహిళలకు మెడలో వేసుకున్న బంగారానికి భద్రత లేదన్న భావనను కలిగిస్తున్నారు. తిరుపతి జిల్లాలోని వెంకటగిరి టీచర్స్ కాలనీలో పట్టపగలే ఓ దుండగుడు ఒక నివాసంలోకి చొరబడి మహిళ కళ్ళల్లో కారం కొట్టి మెడలోని బంగారు గొలుసును లాక్కొని అక్కడి నుంచి పరారయ్యాడు.

మహిళ మెడలోని బంగారు గొలుసును లాక్కుని పారిపోయిన చైన్ స్నాచర్
మరోవైపు తూర్పుగోదావరి జిల్లాలోనూ అనపర్తి లో చైన్ స్నాచర్ ఒక మహిళ మెడలోని బంగారు గొలుసును లాక్కుని పారిపోయాడు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి పందలపాకకు చెందిన వడ్లపూడి వీర రాఘవ తన భార్య విజయలక్ష్మితో కలిసి ద్వారంపూడి రైల్వే స్టేషన్ కు బైక్ మీద బయలుదేరాడు.
బోది కాలువలో పడిన భార్యాభర్తలు
వారు బైక్ పైన అనపర్తి శివారుకు చేరుకునే సరికి ఓ దుండగుడు వారి వైపు బైక్ పై వచ్చి బైక్ వెనుక కూర్చున్న విజయలక్ష్మి మెడలోని బంగారు గొలుసును బలంగా లాక్కొని అక్కడి నుండి పారిపోయాడు. ఒక్కసారిగా జరిగిన సంఘటనతో మెడలోని బంగారు గొలుసు బలంగా లాగడంతో బైక్ బ్యాలెన్స్ తప్పి భార్యాభర్తలు ఇద్దరు పక్కనే ఉన్న బోది కాలువలో పడిపోయారు.
తమ బంగారానికి భద్రత కల్పించాలని మహిళల వినతి
వారు తేరుకునే లోపు దుండగుడు అక్కడ నుండి పరారయ్యాడు. ఆపై వారు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇలా వరుస ఘటనలతో ఏపీలోని ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. బంగారం వేసుకొని బయటకు వెళ్లాలంటే భయపడుతున్నారు. తమ బంగారానికి భద్రత కల్పించాలని తమకు రక్షణ కల్పించాలని పోలీసులను విజ్ఞప్తి చేస్తున్నారు.












Click it and Unblock the Notifications