ఏపీలో మూడో సారి రీపోలింగ్..? మరో రెండు కేంద్రాల్లో అక్రమాలు గుర్తింపు: రాత్రికి నిర్ణయం..!
ఏపీలో రెండో సారి రీ పోలింగ్ పైన రగడ నడుస్తుండగానే..మూడో సారి రీ పోలింగ్ తప్పేలా లేదు. టీడీపీ నేతలు 18 పోలింగ్ కేంద్రాల్లో రీ పోలింగ్‌కు డిమాండ్ చేసారు. ఆ కేంద్రాల్లో అధికారులు సీసీ టీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు. ఇదే సమయంలో చంద్రగిరి నియోజకవర్గంలో రెండు పోలింగ్ కేంద్రాల్లో అక్రమాలు జరిగినట్లు అధికారులు నిర్ధారించారు. దీంతో..ఆ రెండు కేంద్రాల్లో సీఈవో రీ పోలింగ్‌కు సిఫార్సు చేసారు. ఎన్నికల సంఘం ఈ రాత్రికి ఆ రెండు కేంద్రాల్లో రీ పోలింగ్ పైన నిర్ణయం తీసుకోనుంది.

చంద్రగిరిలో అక్రమాలు నిజమే..
చంద్రగిరి రీ పోలింగ్ పైన రగడ కొనసాగుతుండగానే..ఎన్నికల సంఘం వేగంగా నిర్ణయాలు తీసుకుంటోంది. చంద్రగిరిలో అయిదు పోలింగ్ కేంద్రాల్లో రీ పోలింగ్ పైన రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వివరణ ఇచ్చారు. ప్రతీ ఒక్కరి ఫిర్యాదుల పైన ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేసారు. రీ పోలింగ్‌కు అదేశించిన అయిదు కేంద్రాల్లో ప్రిసైడింగ్ అధికారి..సహాయ ప్రిసైడింగ్ అధికారిన పైన కేసులు నమోదు చేస్తామన్నారు. ఎన్నికల అక్రమాలను దాచి పెట్టాలని ఎన్నికల సంఘానికి లేదన్నారు.చంద్రగిరిలో జరిగిన అక్రమాల పైన స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని స్పష్టం చేసారు. ఎన్నికల సిబ్బంది కుమ్మక్కైతే దానిని ఈసీ చూస్తూ ఊరుకోవాలా అని ప్రశ్నించారు.చంద్రగిరిలో పోలింగ్ కేంద్రాల్లో ఉన్న ఫుటేజ్ చూస్తే అసలు ప్రజాస్వామ్యంలో ఇలా ఉంటుందా అనే అనుమానం కలుగుతోందని ఆవేదన వ్యక్తం చేసారు. ఇదే సమయంలో అవసరమైతే కోర్టుకు నివేదిస్తామన్నారు.

టీడీపీ ఫిర్యాదుల పైనా పరిశీలన..
టీడీపీ నేతలు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యంను కలిసి తాము గతంలో ఇచ్చిన ఫిర్యాదును మరో సారి ప్రస్తావించారు. ఏడు నియోజకవర్గాల్లో 19 పోలింగ్ కేంద్రాల్లో రీ పోలింగ్ చేపట్టాలని కోరారు. దీనిని సైతం సీఎస్ రాష్ట్ర ఎన్నికల ప్రధానాదికారికి పంపారు. దీనిని ఆయన కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదించారు. ఆ పోలింగ్ కేంద్రాల్లోని సీసీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. టీడీపీ నేతలు కోరుతున్న కేంద్రాల్లో వాస్తవాలను పరిశీలించి రీ పోలంగ్ కు నిర్ణయం తీసుకుంటామని కేంద్ర ఎన్నికల సంఘం ముఖ్యమంత్రి చంద్రబాబుకు హామీ ఇచ్చింది. దీంతో..మరి కొన్ని పోలింగ్ స్టేషన్లలో రీ పోలింగ్ మరో సారి అనివార్యంగా కనిపిస్తోంది.

21న రీపోలింగ్..మూడో విడత
ఇక, చంద్రగిరిలోని మరో రెండు పోలింగ్ కేంద్రాల్లోనూ అక్రమాలు చోటు చేసుకున్నట్లుగా ఎన్నికల సంఘం గుర్తించింది. చంద్రగిరి నియోజకవర్గంలోని 310,323 పోలింగ్ కేంద్రాల్లో రీ పోలింగ్ చేపట్టాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి నివేదించారు. దీని పైన నిర్ణయం తీసుకోవాలంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి సీఈవో కోరారు. ఈ రాత్రికి వీటితో పాటుగా టీడీపీ డిమాండ్ చేస్తున్న కేంద్రాల్లో వాస్తవాల ఆధారంగా రీ పోలింగ్ పైన కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకోనుంది. ఎన్నికల సంఘం చంద్రగిరిలోని మరో రెండు కేంద్రాలతో పాటుగా ఇతర చోట్ల అవసరమైతే ఈనెల 21న రీ పోలింగ్‌కు ఆదేశించే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications