ఏపీ బీజేపీని గాడిన పెట్టే పనిలో పురందేశ్వరి.. ఏం చేస్తున్నారంటే!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఏపీలో ప్రతిపక్ష పార్టీ నేతల మధ్య ప్రచ్చన్న యుద్ధం కొనసాగుతుంది. ఏపీలో ముఖ్యంగా అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని జనసేన, టీడీపీలు బలంగా ఢీ కొడుతున్నాయి. ఈ క్రమంలో ఏపీ బీజేపీలో తాజాగా జరిగిన మార్పులు బిజెపిని కూడా ముందు వరుసలోకి తీసుకువచ్చాయని చెప్పొచ్చు.
ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా పురందేశ్వరికి అవకాశం ఇచ్చి, సీనియారిటీకి, సమర్థతకు పటం కట్టిందని ఏపీ బీజేపీ నేతలు భావిస్తున్నారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలుగా పగ్గాలు చేపట్టిన పురందేశ్వరి నిస్తేజంగా ఉన్న పార్టీ శ్రేణులలో జోష్ తీసుకురావడానికి, పార్టీని బలోపేతం చేయడానికి, క్షేత్రస్థాయిలో పార్టీని పునర్నిర్మించి, వచ్చే ఎన్నికలలో బలంగా వైసీపీతో తలబడడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు.

ఇందులో భాగంగా పురందేశ్వరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సీనియర్ నాయకులతో చర్చలు జరుపుతూ, అందరి సూచనల మేరకు కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వరుసగా ఆమె పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడం పైన దృష్టి సారించారు.
గుంటూరులో బిజెపి కోస్తాంధ్ర జోనల్ సమావేశంలో దగ్గుబాటి పురందేశ్వరి పాల్గొన్నారు. ఈ సమావేశంలో రాజధానికి అమరావతికి కేంద్రం కట్టుబడి ఉందని దగ్గుబాటి పురందేశ్వరి పేర్కొన్నారు. అంతేకాదు ఈ సమావేశంలోనే పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేస్తూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం పని చేసే విధంగా కార్యాచరణ రూపకల్పన కూడా చేశారు.
ఇక నేడు రాజమండ్రిలో బిజెపి గోదావరి జోనల్ సమావేశానికి పురందేశ్వరి హాజరుకానున్నారు. జోన్ల వారీగా సమావేశాలు నిర్వహించి పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపి, ప్రజల్లోకి వెళ్లడంలో పార్టీ ఎక్కడ విఫలం చెందుతుందో జాగ్రత్తగా చూసుకుని పార్టీకి దిశా నిర్దేశం చేయనున్నారు పురందేశ్వరి. అంతేకాదు రాష్ట్రంలోని అధికార వైసీపీ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం సాగించడం కోసం కూడా పురందేశ్వరి కార్యచరణ రూపొందిస్తున్నారు.
ఏపీ బీజేపీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన నాటినుండి ప్రభుత్వ పనితీరును, పాలనలోని లోపాలను, వైఫల్యాలను ఎత్తి చూపుతున్నారు.
అంతేకాదు రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ హయాంలో సర్పంచ్ లు ఇబ్బందులు పడుతున్నారని, సర్పంచుల వ్యవస్థను నిర్వీర్యం చేసిన వైసీపీ ప్రభుత్వం పై రాష్ట్రవ్యాప్త నిరసన కార్యక్రమాల కార్యాచరణ రూపొందించిన దగ్గుబాటి పురందేశ్వరి కార్యాచరణను కూడా ప్రకటించారు.












Click it and Unblock the Notifications