మావోయిస్టుల పేరుతో వైసీపీ ఎమ్మెల్యేకు బెదిరింపు లేఖ; ఆశ్చర్యపోయిన ఎమ్మెల్యే ఏం చెప్పారంటే!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మావోయిస్టుల లేఖ కలకలం సృష్టించింది. అధికార వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే ను టార్గెట్ చేస్తూ మావోయిస్టుల పేరుతో లేఖ విడుదలైంది. ఈ లేఖలో పేర్కొన్న అంశాలను చూసి ఎమ్మెల్యే షాక్ తిన్నారు. తనకు ఇలా బెదిరింపు లేఖ రావటంపై ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మికి మావోల పేరుతో బెదిరింపు లేఖ
పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మిని హెచ్చరిస్తూ మావోయిస్టుల పేరుతో విడుదలైన లేఖలో మైనింగ్ ముసుగులో బాక్సైట్ అక్రమ తవ్వకాలకు ఎమ్మెల్యే ప్రోత్సాహాన్ని ఇస్తున్నారని మావోయిస్టులు ఆరోపించారు. జీకే వీధి మండలం చాపరాతిపాలెం లో జరుగుతున్న మైనింగ్ ను తరిమికొట్టాలని వారు ఆ లేఖలో పిలుపునిచ్చారు. చాపరాతి పాలెంలో జరుగుతున్న అక్రమ మైనింగ్ అను ప్రజాస్వామిక వాదులు, విద్యార్థులు, మేధావులు, అన్నివర్గాల ప్రజలు ఖండించాలని లేఖలో మావోయిస్టులు పేర్కొన్నారు.

పార్టీ పదవికి రాజీనామా చేసి మన్యం విడిచిపోవాలని హెచ్చరికలు
మావోయిస్టు పార్టీ ఈస్ట్ డివిజన్ కమిటీ కార్యదర్శి అరుణ పేరుతో వచ్చిన లేఖ పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి పార్టీ పదవికి రాజీనామా చేసి మన్యం విడిచిపోవాలని హెచ్చరికలు జారీ చేశారు. లేకపోతే కిడారి సర్వేశ్వరరావు, సివేరి సోమలకు పట్టిన గతే పడుతుందని, ప్రజా కోర్టులో ప్రజలు శిక్ష విధిస్తారని వార్నింగ్ ఇచ్చారు. వైసిపి పాడేరు నియోజకవర్గ ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి కి మావోయిస్టుల నుంచి బెదిరింపు లేఖ రావడంతో పోలీసులు ఆమెకు భద్రతను పెంచాలని ఆలోచిస్తున్నారు. లేఖ ఎక్కడి నుండి వచ్చింది అన్న దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మావోల పేరుతో బెదిరింపు లేఖపై ఆశ్చర్యం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి
ఇక ఈ లేఖ చూసిన పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి తనకు మావోయిస్టుల పేరుతో బెదిరింపు లేఖ రావడంపై ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. తమ ప్రాంతంలో ఎటువంటి మైనింగ్ జరగడం లేదని, ఎవరికీ తమ పర్మిషన్లు ఇవ్వడం లేదని ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి స్పష్టం చేశారు. ఉత్తరాంధ్ర ప్రాంత పర్యావరణాన్ని కాపాడడం కోసం తాము అహర్నిశలు శ్రమిస్తున్న మన పేర్కొన్న భాగ్యలక్ష్మి ఉత్తరాంధ్ర ప్రాంతంలో బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా తాము పోరాటాలు చేశామని గుర్తు చేశారు. చదువుకున్న వ్యక్తిగా తాను ఉత్తరాంధ్ర ప్రాంత పర్యావరణాన్ని దెబ్బతీసే బాక్సైట్ తవ్వకాలను ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రోత్సహించబోను అని స్పష్టం చేశారు.
Recommended Video

తమ ప్రాంత పర్యావరణాన్ని దెబ్బ తీసే మైనింగ్ ను తాము ప్రోత్సహించమని వెల్లడి
ప్రతిపక్ష పార్టీగా ఉన్న సమయంలో కూడా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అక్రమ మైనింగ్ పై పోరాటం చేశారని పేర్కొన్నారు. అలాంటిది ఇప్పుడు తాము మైనింగ్ చేస్తామా అంటూ భాగ్యలక్ష్మి ప్రశ్నించారు. మావోయిస్టుల పేరుతో ఈ లేఖ ఎవరు రాశారో తనకు తెలియదని, పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని భాగ్యలక్ష్మి వెల్లడించారు. ఇక తనకు వచ్చిన బెదిరింపు లేఖ విషయాన్ని వైసిపి అధిష్టానం దృష్టికి కూడా తీసుకు వెళ్తానని భాగ్యలక్ష్మి పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర ప్రాంతంలో గతంలో జరిగిన అక్రమ బాక్సైట్ తవ్వకాల పై విచారణ జరపాలని తాము ఇప్పటికే కోరామని పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి వెల్లడించారు. తమ ప్రాంత పర్యావరణాన్ని దెబ్బ తీసే ఎటువంటి పనిని తాను చేయబోనని భాగ్యలక్ష్మి పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications