నిమ్మగడ్డతో ముగ్గురు ఐఏఎస్‌ల బృందం భేటీ- స్ధానిక పోరుపై సంప్రదింపులు
ఏపీలో స్ధానిక సంస్ధల ఎన్నికల నిర్వహణకు సంబంధించి హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ముగ్గురు ఐఏఎస్‌లతో కూడిన ప్రభుత్వ ప్రతినిధుల బృందం ఇవాళ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌తో భేటీ అయింది. ఇందులో సీఎస్ ఆదిత్యనాథ్ దాస్‌తో పాటు పంచాయతీరాజ్, వైద్యారోగ్యశాఖల ముఖ్య కార్యదర్శులు ఉన్నారు.

పంచాయతీ ఎన్నికలను వచ్చే నెలలో నిర్వహించేందుకు ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం వాటిని వ్యతిరేకిస్తోంది. కరోనా సెకండ్‌వేవ్, వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమం ఉన్నందున ఎన్నికలను ఫిబ్రవరిలో నిర్వహించడం సాధ్యం కాదని చెబుతోంది. దీంతో ప్రభుత్వం కోరుతున్న విధంగా ఎన్నికలు వాయిదా వేసేందుకు నిమ్మగడ్డ సిద్ధంగా లేరు. వ్యాక్సినేషన్ షెడ్యూల్ ఇంకా రానందున ఎన్నికలకు ఎలాంటి ఆటంకాలు ఉండబోవని ఆయన చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణపై చర్చించేందుకు ముగ్గురు ఐఏఎస్‌ల బృందం నిమ్మగడ్డతో భేటీ అయింది. స్దానిక ఎన్నికలపై ప్రభుత్వ వైఖరిని ఐఏఎస్‌లు నిమ్మగడ్డకు వివరించినట్లు తెలుస్తోంది. ఎన్నికలను ఫిబ్రవరిలో నిర్వహించాలంటే ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేయాలని, పండుగలు, వ్యాక్సినేషన్ కార్యక్రమం ఉంటాయని ఆయనకు తెలిపింది. అయితే ప్రభుత్వ వాదనను ముందే ఊహించిన నిమ్మగడ్డ వారికి ఏం సమాధానం చెప్పారన్నది బయటికి రాలేదు.