ఉద్యోగాలు రాలేదని ఏపి, టిలో ముగ్గురి ఆత్మహత్య

Three students allegedly committed suicide
హైదరాబాద్: చేతికందిన ఉద్యోగాలు రాకుండా పోయాయని మనస్తాపానికి గురైన ఇద్దరు యువకులు, ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడ్డారు. డిఎస్సీ 1998 కటాఫ్ మార్కులను తగ్గించడంతో నష్టపోయిన మెరిట్ అభ్యర్ధులకు చేతిదాకా వచ్చిన కొలువు ఎప్పటికపుడు చేజారిపోవడంతో సోమవారం ఆంధ్రప్రదేశ్‌లో ఒకరు, తెలంగాణలో ఇద్దరు అభ్యర్ధులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు.

ఏపిలోని అమలాపురానికి చెందిన ఎం శ్రీనివాసరావు, తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం పట్టణానికి చెందిన ఎన్ శ్రీనివాస్, నల్గొండకు చెందిన ఆదిలక్ష్మీ ఆత్మహత్య చేసుకున్నారు. 1998 నుండి ప్రతి రోజూ అధికారులు ఉద్యోగాలు ఇస్తామని ఆశలు చూపడమే తప్ప, తర్వాత ఎన్ని డిఎస్సీ నోటిఫికేషన్లు జారీఅయినా వారికి ఉద్యోగాలు రాలేదు.

1998 డిఎస్సీలో తక్కువ మార్కులు వచ్చిన వారికి ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వం, ఎక్కువ మార్కులు వచ్చిన వారికి ఉద్యోగాలు ఇవ్వకపోవడంతో ఎంత పెద్దఎత్తున న్యాయపోరాటం చేసినా ఫలితం లేకపోయింది. దీంతో రెండు వేల మంది టీచర్లు త్రిశంకు స్వర్గంలో కొట్టుమిట్టాడుతున్నారు. చివరికి ట్రిబ్యునల్ కోర్టులు కూడా పలుమార్లు రాత పరీక్షలో కటాఫ్ మార్కులకంటే ఎక్కువ మార్కులు సాధించిన వారికి ఉద్యోగాలివ్వాలని ఆదేశించినా ఫలితం లేదు.

అభ్యర్ధులు ప్రభుత్వంపై కోర్టు ధిక్కారం కేసు వేస్తే దానిని తొలగించే ప్రయత్నం చేసిందే తప్ప ఫలితం లేకపోవడంతో వారు సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు. 1994 నుండి ప్రతి డిఎస్సీలో రాత పరీక్ష, మౌఖిక పరీక్ష నిర్వహిస్తున్నారు. అందులో అర్హత సాధించిన వారికి మెరిట్ ప్రకారం ఉద్యోగాలు ఇస్తున్నారు. ఇదే క్రమంలో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం 1998లో 40వేల ఉపాధ్యాయ పోస్టులకు మెగా డిఎస్సీ నిర్వహించింది. 85 మార్కులను రాత పరీక్షకు, 15 మార్కులను ఇంటర్వ్యూకు కేటాయించారు.

ఓసీలకు 50 మార్కులు, బిసిలకు 45 మార్కులు, ఎస్సీ, ఎస్టీలకు 40 మార్కులను కటాఫ్‌గా నిర్ణయించారు. రాత పరీక్ష ఫలితాలు ప్రకటించే సమయంలో కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో శాసనసభ ఉప ఎన్నికలు జరుగుతుండటంతో డిఎస్సీ ఫలితాలను నాలుగు జిల్లాల్లో ప్రకటించలేదు. అదే నిరుద్యోగులకు శాపంగా మారింది. అయితే మిగిలిన 19 జిల్లాల్లో ప్రకటించిన డిఎస్సీ రాత పరీక్షల్లో ప్రభుత్వం నిర్ణయించిన కటాఫ్ మార్కులు సాధించిన అభ్యర్ధులు దొరకలేదు.

ఖాళీలకంటే అభ్యర్ధుల సంఖ్య తక్కువగా ఉండటంతో ప్రభుత్వం ఓసీలకు 45, బిసిలకు 40, ఎస్సీ-ఎస్టీలకు 35 మార్కులుగా కటాఫ్ తగ్గించింది. ఉప ఎన్నికలు లేని జిల్లాల్లో 1:2 నిష్పత్తిలో రెండో జాబితాను ప్రభుత్వం విడుదల చేసింది. ఉప ఎన్నికలు పూర్తయిన తర్వాత కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో రెండు జాబితాలను ఒకేమారు విడుదల చేశారు. దీంతో అభ్యర్ధులకు తీవ్రమైన నష్టం వాటిల్లింది. పరీక్షలో ఎక్కువ మార్కులు వచ్చినా, ఇంటర్వ్యూల్లో సున్నా మార్కులు పొంది ఉద్యోగాలు కోల్పోయారు. అప్పటి నుండి వారు ఉద్యోగాల కోసం పోరాడుతునే ఉన్నారు.

2004 ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ డిఎస్సీ 1998 అభ్యర్ధులకు ఉద్యోగాలు ఇస్తామని పేర్కొనడంతో మళ్లీ ఆ అంశం తెరమీదకు వచ్చింది. డిఎస్సీ 1998లో మిగిలిపోయిన 15వేల పోస్టులకుగానూ అభ్యర్ధులు కేవలం 6వేల మంది మాత్రమే మిగిలారని పాఠశాల విద్యాశాఖ నివేదిక ఇచ్చిందని 1998 డిఎస్సీ పోరాట కమిటీ అధ్యక్షుడు ఎర్రంశెట్టి సుబ్బారాయుడు, కార్యదర్శి రామలింగేశ్వరరావు, కమిటీ సభ్యుడు సూర్యనారాయణలు పేర్కొన్నారు.

16 ఏళ్లుగా సుదీర్ఘపోరాటం చేసిన వారిలో చాలామందికి ఉద్యోగ పరీక్షలు రాసేందుకు వయోపరిమితి దాటిపోయిందని అన్నారు. ఉద్యోగాలు రావనే బెంగతో ఇప్పటికే 150 మంది ఆత్మహత్య చేసుకున్నారని సహ అభ్యర్ధులు చెబుతున్నారు. 1999లో ట్రిబ్యునల్ కటాఫ్ మార్కులు తగ్గించడం సబబుకాదని పేర్కొంది. దానిపై ప్రభుత్వం 2000లో హైకోర్టు అభ్యర్ధులకు అనుకూలంగా తీర్పు చెప్పగా, ప్రభుత్వం అప్పీలుకు వెళ్లింది. సుప్రీంకోర్టు సైతం హైకోర్టు తీర్పును అమలుచేయాలని పేర్కొనగా, అందరికీ ఉద్యోగాలు ఇచ్చేశామని ప్రభుత్వం కోర్టు దృష్టికి తెచ్చింది.

అయితే ప్రభుత్వం ఎవరికీ ఉద్యోగాలు ఇవ్వలేదని మరోమారు అభ్యర్ధులు 2005లో ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. దానిపై 2009లో ట్రిబ్యునల్ తుది తీర్పు ఇవ్వగా, విద్యాశాఖ హైకోర్టును ఆశ్రయించింది. దానిపై హైకోర్టు అభ్యర్ధులకు ఉద్యోగాలు ఇవ్వాల్సిందేనని 2008 నవంబర్ 11న తీర్పు ఇచ్చింది. నియామక తేదీ నుండి సీనియారిటీ, ప్రయోజనాలను సైతం కల్పించాలని ఆదేశించింది. అయినా ప్రభుత్వం ఒక్కరికీ ఉద్యోగాలు ఇవ్వలేదని అభ్యర్ధులు వాపోతున్నారు.

ప్రభుత్వంపై ధిక్కార కేసు దాఖలు చేయగా, ఆ పోస్టులు ప్రస్తుతం లేవని చెప్పి ప్రభుత్వం తప్పించుకోవాలని చూస్తే, 2013 ఆగస్టులో మరోమారు అభ్యర్ధులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దానిపై కోర్టు ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసినా ఫలితం లేకపోయింది. దాంతో విసిగి వేసారిపోతున్న అభ్యర్ధులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని డిఎస్సీ అభ్యర్ధుల సంఘం నేతలు ఆవేదన వ్యక్తం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+