తిరుమలలో మరో.. బంగారు బిస్కెట్ పట్టుకుంటే బయటపడ్డ 46 లక్షల చోరీ..!
తిరుమలలో మరో అరాచకం బట్టబయలైంది. భక్తులు ఎంతో భక్తితో శ్రీవారికి సమర్పించే అభరణాల భద్రత ఎలా ఉందనేది మరోసారి బయటపడింది. తాజాగా పరకామణిలో బంగారు బిస్కెట్ దొంగిలిస్తూ ఓ ఉద్యోగి పట్టుబడిన వ్యవహారంలో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు.
దీంతో విస్తుపోయే వాస్తవాలు బయటపడ్డాయి. దీంతో ఇలాంటి వ్యవహారాలు ఇంకెన్ని సాగుతున్నాయో అన్న అనుమానాలు మొదలయ్యాయి.

తిరుపతికి చెందిన వీరిశెట్టి పెంచలయ్య అనే కాంట్రాక్ట్ ఉద్యోగి పరకామణిలో కొంతకాలంగా పనిచేస్తున్నాడు. తాజాగా పరకామణిలో అతను 100 గ్రాముల బంగారు బిస్కెట్ ను చోరీ చేస్తూ పట్టుబడ్డాడు. ట్రాలీ పైపుల్లో ఉంచి ఈ బిస్కట్ ను తరలిస్తూ దొరికిన పెంచలయ్య పట్టుకునేలోపు పారిపోయాడు. చివరికి పోలీసులు అతన్ని పట్టుకున్నారు. విచారణలో అతను చెప్పిన విషయాలు విని పోలీసులు షాకయ్యారు.
పరకామణిలోని బంగారం నిల్వ చేసే విభాగంలో ఉంచే వస్తువుల్ని దొంగిలించడం పెంచలయ్యకు అలవాటని పోలీసుల దర్యాప్తులో తేలింది. రెండేళ్లుగా అక్కడ పనిచేస్తున్న పెంచలయ్య.. ఇలా రూ.46 లక్షల విలువైన బంగారు వస్తువులు చోరీ చేసినట్లు పోలీసులు గుర్తించారు. అంతే కాదు అతని నుంచి 555 గ్రాముల బంగారు బిస్కెట్లు, 100 గ్రాముల అభరణాలు, 157 గ్రాముల వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. వీటి మొత్తం విలువ రూ.46 లక్షలు ఉంటుందని తేల్చారు. అయితే అతను పెద్గ వస్తువుల జోలికి వెళ్లకపోవడం విశేషం.
తిరుమలలో ఇప్పటికే పలు ఉల్లంఘనలు జరుగుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. లడ్డూ కల్తీపై తాజాగా రచ్చ జరిగింది. అలాగే టికెట్లు, టోకెన్ల జారీపై ఇప్పటికే టీటీడీ తీరుపై భక్తులు గుర్రుగా ఉన్నారు. ఇలాంటి సమయంలో స్వామి వారికి తాము సమర్పించిన కానుకల్ని సైతం టీటీడీ ఉద్యోగులు దొంగిలించుకుపోతుండటం భక్తుల్లో ఆగ్రహం మరింత పెంచుతోంది.












Click it and Unblock the Notifications