మహా కుంభమేళాలో కమనీయంగా తిరుమల శ్రీవారి కళ్యాణోత్సవం!
జనవరి 13వ తేదీ నుండి ఫిబ్రవరి 26 మహాశివరాత్రి వరకు మహా కుంభమేళా జరుగుతున్న విషయం తెలిసిందే . కలియుగ ప్రత్యక్ష దైవం ఏడుకొండల పైన కొలువైన దేవదేవుడు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ప్రయాగ్ రాజ్ లో నిర్వహిస్తున్న కుంభమేళాలోనూ భక్తులను కరుణిస్తున్నారు.
అంగరంగ వైభవంగా శ్రీవారి కళ్యాణం
మహా కుంభమేళా సందర్భంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్ రాజ్ లో ఏర్పాటు చేసిన శ్రీవారి నమూనా ఆలయ ప్రాంగణంలో శ్రీ శ్రీనివాస కళ్యాణం ఎంతో వైభవంగా నిన్న నిర్వహించారు. కుంభమేళాకు వచ్చిన భక్తులు తిరుమల శ్రీవారి కల్యాణ వైభవాన్ని అక్కడ దర్శించి తరించారు. మహా కుంభమేళాలో ఏర్పాటు చేసిన శ్రీవారి నమూనా ఆలయంలో నిన్న అంగరంగ వైభవంగా కళ్యాణం జరిపించారు.

స్వామి కళ్యాణం ఎలా జరిగిందంటే
తిరుమల శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు ఆధ్వర్యంలో అర్చక బృందం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ స్వామివారి ఉత్సవ మూర్తులను కళ్యాణ వేదిక వద్దకు తీసుకువచ్చారు. అనంతరం ఉదయం 11 గంటల నుండి 12 గంటల వరకు అర్చకులు వేదమంత్రోచ్ఛారణలు, మంగళ వాయిద్యాలు నడుమ స్వామివారి విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, కంకణ ధారణ, అగ్ని ప్రతిష్టాపన, యజమాని సంకల్పం, భక్త సంకల్పం, మహా సంకల్పం గావించారు.
శ్రీనివాస కళ్యాణం తిలకించి పరవశించిన కుంభమేళాకు వచ్చిన భక్తులు
మాంగల్య పూజ, మంగళసూత్ర ధారణ మొదలైన ఘట్టాలతో స్వామివారికి శాస్త్రోక్తంగా అమ్మవార్లతో కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. ఆపై స్వామి అమ్మవార్లకు నక్షత్ర హారతి, మంగళ హారతి సమర్పించడంతో కళ్యాణం దిగ్విజయంగా ముగిసింది. కోట్లాదిగా భక్తులు, సాధుపుంగవులు వస్తున్న మహాకుంభమేళాలో శ్రీవారు అమ్మవారి కళ్యాణ ఘట్టాన్ని అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ నేత్రపర్వంగా తిలకించి భక్తి పరవశంతో పులకించిపోయారు.
శ్రీవారి నమూనా ఆలయంలో స్వామి దర్శనం
ఈ కార్యక్రమాన్ని తిరుమలలో ఏ విధంగా అయితే నిర్వహిస్తారో అదే విధంగా నిర్వహించడానికి శ్రీవారి ఆలయ ప్రధానఅర్చకుడు గోపీనాథ్ దీక్షితులతో పాటు పలువురు ఆలయ అధికారులు విశేషంగా కృషిచేశారు. కాగా మహా కుంభమేళాకు వచ్చిన భక్తులు తిరుమల శ్రీవారిని ప్రశాంతంగా దర్శించుకునేలాగా అన్ని ఏర్పాట్లు చేసింది టీటీడీ. ప్రయాగరాజ్‌లోని సెక్టార్ 6, భజరంగ్‌దాస్ రోడ్డులోని నాగవాసుకి ఆలయానికి సమీపంలో శ్రీవారి నమూనా ఆలయం ఏర్పాటుచేసి భక్తులకు స్వామి దర్శనం కల్పిస్తున్నారు.
తిరుమలలో మళ్ళీ శ్రీనివాస కళ్యాణం ఈ తేదీలలోనే
మొత్తం 2.89 ఎకరాల స్థలంలో శ్రీవారి నమూనా ఆలయం ఏర్పాటు చేసి, సుప్రభాతం నుంచి ఏకాంతసేవ వరకు అన్ని సేవలనూ నిర్వహిస్తున్నారు..తిరుమలలో ఏ విధంగా అయితే శ్రీవారి కల్యాణోత్సవాలు, చక్రస్నానం తదితర కైంకర్యాలు జరుపుతారో అదేవిధంగా అక్కడ కూడా స్వామివారి కైంకర్యాలు జరపుతున్నారు. మళ్ళీ జనవరి 26, ఫిబ్రవరి 3 ,12 తేదీల్లో 4 సార్లు శ్రీవారి కల్యాణోత్సవం అక్కడ ఘనంగా నిర్వహించనున్నారు.












Click it and Unblock the Notifications