ఎంతసేపు జగన్ మీద పడి ఏడవడానికే వీళ్లందరూ..: ఒక్కొక్కర్ని పేరు పేరునా ఏకేసిన రోజా

Tirupati Stampede: తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం కోసం తిరుపతిలో టోకెన్ల జారీ కౌంటర్ల వద్ద చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటన ప్రకంపనలు తగ్గట్లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వంపై విమర్శల ముప్పేట దాడి కొనసాగుతూనే ఉంది.

తిరుపతిలోని పద్మావతి పార్కు, విష్ణునివాసం వద్ద బుధవారం రాత్రి ఈ దుర్ఘటన సంభవించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఆరుమంది దుర్మరణం పాలయ్యారు. వారిలో అయిదుమంది మహిళలు ఉన్నారు. 41 మంది గాయపడ్డారు. యావత్ దేశాన్నీ దిగ్భ్రాంతికి గురి చేసిన ఉదంతం ఇది.

Tirupati Stampede incident Roja slams TDP Janasena and BJP leaders including Purandeswari

ఈ ఘటన పట్ల ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు, మాజీ మంత్రి ఆర్ కే రోజా మరోసారి ఘాటు విమర్శలు సంధించారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరిపై నిప్పులు చెరిగారు.

తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ బీఆర్ నాయుడు, తిరుపతి జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ సుబ్బరాయుడు, ఇతర అధికారులపైనా తీవ్ర ఆరోపణలను గుప్పించారు. అత్యంత పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలిలో చంద్రబాబు తన సొంత మనుషులను పెట్టుకుని, ఏకంగా ఆరుమందిని బలి తీసుకున్నాడని విమర్శించారు.

ఇప్పటివరకూ ఏ ఒక్కరి మీద కూడా కేసు నమోదు చేయలేదని, తన వాళ్లని కాపాడే ప్రయత్నం చేస్తోన్నాడని రోజా విమర్శించారు. కోట్లాదిమంది హిందువులు అన్నా, వారి ప్రాణాలన్నా చంద్రబాబుకు ఎంత గౌరవం అనేది లేకుండా పోయిందని ధ్వజమెత్తారు. పంతం నానాజీ ఒక్క ప్రొఫెసర్‌ గూబ పగులగొడితే అతనిపై చర్యలు తీసుకోవడానికి పవన్ కల్యాణ్‌కు కులం అడ్డొచ్చిందని ఆరోపించారు.

తనకు రోజూ భజన చేస్తున్నాడనే కారణంతో అర్హత లేకపోయినా బీఆర్ నాయుడిని టీటీడీ ఛైర్మన్ చేశాడని, తన వద్ద గతంలో ఓఎస్డీగా పని చేసిన సీహెచ్ వెంకయ్య చౌదరిని అదనపు ఈవోగా, జేఈవోగా పోస్టింగ్ ఇచ్చాడని విమర్శించారు. తన వద్ద సెక్యూరిటీ ఆఫీసర్‌గా పని చేసిన సుబ్బారాయుడిని తిరుపతి జిల్లా ఎస్పీగా అపాయింట్ చేశాడని మండిపడ్డారు.

కుప్పంలో పర్యటించిన చంద్రబాబు ఒక్కసారైనా తిరుమలలో వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించాడా? అంటూ రోజా ప్రశ్నించారు. ఆ పని చేయని నాయకుడు విజనరీ ఎలా అవుతాడని నిలదీశారు. కుప్పం విజన్ 2029, స్వర్ణ కుప్పం అంటూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు చేసే బదులు టీటీడీ మీడ సమీక్ష నిర్వహించి ఉండొచ్చని హితవు పలికారు.

జిల్లా పోలీసులందరినీ తన చుట్టూ తిప్పుకొని వారి మీద పని ఒత్తిడిని తీసుకొచ్చాడని రోజా ఆరోపించారు. ఫలితంగా తిరుపతిలో టోకెన్ల జారీ కౌంటర్ల వద్ద సరైన భద్రత లేకుండా పోయిందని, ఫలితంగా ఆరుమంది ప్రాణాలను కోల్పోవాల్సి వచ్చిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందంటూ లేనిపోని అవాస్తవాలను ప్రచారం చేసిన సమయంలో చంద్రబాబు సహా కూటమి నాయకులందరూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద దుష్ప్రచారం చేశారని, ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఆరుమంది చనిపోతే విమర్శించడానికి ఒక్కరూ ముందుకు రావట్లేదని అన్నారు.

దగ్గుబాటి పురంధేశ్వరి, మంత్రులు వంగలపూడి అనిత, ఆనం రామనారాయణ రెడ్డి ఇప్పుడు ఏమైపోయారని రోజా ప్రశ్నించారు. వైఎస్ఆర్సీపీ మీద లేనిపోని అభాండాలు వేయడానికి, ఎంతసేపు జగన్ మీద పడి ఏడవడానికే వీళ్లందరూ ఉన్నారని ఎద్దేవా చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+