జగన్ ట్వీట్ కు నటుడు బ్రహ్మాజీ స్ట్రాంగ్ కౌంటర్-తర్వాత అకౌంట్ హ్యాక్ అని డిలీట్..!
విజయవాడ వరద బాధితులకు అందుతున్న సాయం విషయంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ కూటమి ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ పెట్టిన ఓ ట్వీట్ సంచలనం రేపింది. అయితే దానికి కౌంటర్ గా టాలీవుడ్ నటుడు బ్రహ్మాజీ పెట్టిన మరో ట్వీట్ అంతకంటే కలకలం రేపింది. దీంతో వైసీపీ క్యాడర్ బ్రహ్మాజీపై ఎక్స్ లో విరుచుకుపడుతున్నారు. ఈ నేపథ్యంలో బ్రహ్మాజీ సదరు ట్వీట్ డిలీట్ చేసేసి తన అకౌంట్ హ్యాక్ అయిందంటూ మరో ట్వీట్ పెట్టి వివాదానికి ముగింపు పలికే ప్రయత్నం చేస్తున్నారు.
ఇంతకీ ఏం జరిగిందంటే.. విజయవాడ వరద బాధితులకు అందుతున్న సాయంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ విపక్ష నేత వైఎస్ జగన్ నిన్న ఓ ట్వీట్ పెట్టారు. అందులో వరద వచ్చి 8 రోజులు గడుస్తున్నా బాధితులకు ఇప్పటికీ దారీతెన్నూ లేకుండాపోయింది. ఇంకా ఆకలికేకలు వినిపిస్తూనే ఉన్నాయి. అసలు ప్రభుత్వం అనేది ఉందా? లేదా? అని అనిపిస్తోందంటూ జగన్ ప్రశ్నించారు. అసలు ఇదంతా ఎందుకు జరిగింది? దీనికి కారణం మీరు నిర్లక్ష్యంగా వ్యవహరించడం కాదా చంద్రబాబు గారూ? అంటూ నిలదీశారు.
1.@ncbnగారూ… విజయవాడలో వరద వచ్చి 8 రోజులు గడుస్తున్నా బాధితులకు ఇప్పటికీ దారీతెన్నూ లేకుండాపోయింది. ఇంకా ఆకలికేకలు వినిపిస్తూనే ఉన్నాయి. అసలు ప్రభుత్వం అనేది ఉందా? లేదా? అని అనిపిస్తోంది. వరదలకన్నా మీ నిర్వాకాల వల్ల నెలకొన్న విషాదం, మీ అసమర్థత వల్ల వచ్చిన నష్టం భారీగా ఉంది. 5…
— YS Jagan Mohan Reddy (@ysjagan) September 7, 2024
అయితే దీనికి కౌంటర్ గా నటుడు బ్రహ్మాజీ కౌంటర్ ట్వీట్ పెట్టారు. ఇందులో జగన్ పై వ్యంగాస్త్రాలు సంధించారు. బ్రహ్మాజీ తన ట్వీట్ లో మీరు కరెక్ట్ సార్.. వాళ్లు చేయలేరు సార్.. ఇక నుంచి మనం చేద్దాం సార్ అంటూ మొదలుపెట్టారు. ముందు మనం వెయ్యి కోట్లు రిలీజ్ చేద్దాం సార్.. ఆ తర్వాత మన క్యాడర్ మొత్తాన్ని రంగంలోకి దింపుదాం సార్.. మనకి ప్రభుత్వం ముఖ్యం కాదు జనాలు ముఖ్యం సార్ అంటూ రెచ్చిపోయారు.

దీంతో వైసీపీ నెటిజన్లు బ్రహ్మాజీకి కౌంటర్లు వేయడం మొదలుపెట్టారు. ఓ రేంజ్ లో బూతులతో విరుచుకుపడ్డారు. మా జగన్ నే టార్గెట్ చేస్తావా అంటూ ఇష్టారాజ్యంగా తిట్టారు. ఈ ట్వీట్లు ఏ స్ధాయిలో ఉన్నాయంటే వాటి ధాటికి బ్రహ్మాజీ ఏకంగా తన ట్వీట్ ను డిలీట్ చేయాల్సి వచ్చింది. అంతే కాదు తన ఎక్స్ అకౌంట్ హ్యాక్ అయిందని.. దీనిపై ఫిర్యాదు కూడా చేసినట్లు చెప్పుకొచ్చారు. అయినా వైసీపీ ట్వీట్లు ఆగడం లేదు.
Naa X అకౌంట్ ఏవోరో hack చేసి ట్వీట్ చేసారు .. నాకు ఆ tweet కి సంబంధం లేదు ..కంప్లైంట్ చేసాం ..🙏🏼🤗
— Brahmaji (@actorbrahmaji) September 8, 2024
ఇప్పటికే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గరి నుంచీ సినీ పరిశ్రమ అండగా నిలుస్తోంది. బెజవాడ వరద విషయంలోనూ ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు భారీగా విరాళాలు కూడా ప్రకటించారు. ఈ సమయంలో జగన్ చేసిన ట్వీట్ సినీ ఇండస్ట్రీకే చెందిన బ్రహ్మాజీని తాకింది. దీంతో ఆయన సెటైర్లు వేసినా ఆ తర్వాత వెనక్కి తగ్గారు.












Click it and Unblock the Notifications