ఫైనల్‌గా జగన్ వద్దకు: చిరంజీవితో కలిసి వెళ్లేది వీరే: వద్దు, వద్దంటూనే మెగాస్టార్ పెద్దన్నపాత్ర
అమరావతి: ఏపీలో భారీ బడ్జెట్ సినిమాల సందడి ఇంకొద్దిరోజుల్లో మొదలు కాబోతోంది. వందల కోట్ల రూపాయల వ్యయంతో తెరకెక్కిన సినిమాలను వరుసబెట్టి విడుదల కానున్నాయి. ప్రేక్షకులను పలకరించనున్నాయి. పవన్ కల్యాణ్-రానా నటించిన మల్టీస్టారర్ మూవీ భీమ్లానాయక్, ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రామ్‌చరణ్-జూనియర్ ఎన్టీఆర్ నటించిన ట్రిపుల్ ఆర్, ప్రభాస్-పూజాహెగ్డే జంటగా తెరకెక్కిన రాధేశ్యామ్, సూపర్‌స్టార్ మహేష్ బాబు, కీర్తిసురేష్ సర్కారువారి పాట, మెగాస్టార్ నటించిన ఆచార్య..ఇవన్నీ ఉప్పెనలా అభిమానులను ముంచెత్తనున్నాయి.

కొలిక్కి రాని టికెట్ల వ్యవహారం..
ఈ పరిస్థితుల్లో- ఏపీలో సినిమా టికెట్ల వ్యవహారం కొలిక్కి రాకపోవడం తెలుగు చలనచిత్ర పరిశ్రమ పెద్దలను కలవరపాటుకు గురి చేస్తోంది. సినిమా టికెట్లపై ప్రభుత్వ నియంత్రణ తొలగిపోతే గానీ.. సినిమా చిత్రీకరణపై పెట్టిన ఖర్చు వెనక్కి రాదనే ఆందోళన నిర్మాతల్లో నెలకొని ఉంది. టికెట్ల రేట్లను పెంచుకునే విషయంపై ఇప్పటికే టాలీవుడ్ పెద్దలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్ని నానిని కలిసినప్పటికీ.. పెద్దగా ప్రయోజనం కనిపించలేదు. రేట్ల వ్యవహారంలో జగన్ ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు.

చిరంజీవికే బాధ్యతలు..
అక్కినేని నాగార్జున కూడా వైఎస్ జగన్‌ను కలిసినప్పటికీ.. అది లంచ్ మీటింగ్‌గా ముగిసిందనే వార్తలు వెలువడ్డాయి. ఈ పరిణామాల మధ్య మరోసారి- ఈ అంశం తెరమీదికి వచ్చింది. మెగాస్టార్ చిరంజీవి బరిలోకి దిగారు. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరుడిగా ఫిల్మ్ ఇండస్ట్రీలో చిరంజీవికి గుర్తింపు ఉంది. వైఎస్ఆర్సీపీ తరఫున ఆయన రాజ్యసభకు వెళ్తారనే ప్రచారం కూడా ఇదివరకు చోటు చేసుకున్న విష

10న భేటీ..
దీనితో మరోసారి టాలీవుడ్ పెద్దలు చిరంజీవికి పెద్దరికాన్ని అప్పగించారు. టికెట్ల వివాదాన్ని పరిష్కరించే బాధ్యతను ఆయన భుజాలపై పెట్టారు. దీనితో చిరంజీవి- వైఎస్ జగన్‌తో భేటీ కానున్నారు. ఈ నెల 10వ తేదీన ఆయన తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రితో భేటీ కానున్నారు. చిరంజీవి సారథ్యంలోని టాలీవుడ్ ప్రతినిధుల బృందంలో మరో నలుగురు ఉంటారు. ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున, నిర్మాతలు నారాయణ్ దాస్ నారంగ్, సీ కల్యాణ్, ఆర్ నారాయణమూర్తి ఉంటారని తెలుస్తోంది.

పేర్ని నాని సహా...
నిజానికి ఈ సమావేశం ఇవ్వాళే ఏర్పాటు కావాల్సి ఉన్నప్పటికీ.. అది వాయిదా పడింది. తాజాగా ఈ సమావేశం 10వ తేదీన షెడ్యూల్ చేశారు. వైఎస్ జగన్‌తో పాటు పేర్ని నాని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సమీర్ శర్మ సహా టికెట్ల అంశంపై ప్రభుత్వం ఇదివరకే ఏర్పాటు చేసిన కమిటీ ప్రతినిధులు ఇందులో పాల్గొంటారు. ఈ సమావేశం తరువాత- ఏపీ ప్రభుత్వం సినిమా టికెట్ల నియంత్రణ విషయంలో ఓ కీలక నిర్ణయాన్ని తీసుకోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.

వద్దు, వద్దంటూనే పెద్దరికం..
కాగా- ఏపీ ప్రభుత్వంతో చర్చలను నిర్వహించే బాధ్యత మరోసారి మెగాస్టార్ చిరంజీవికి దక్కడం ప్రాధాన్యతను సంతరించుకుంది. తనకు ఎలాంటి పెద్దరికాలు వద్దంటూ ఇదివరకు చిరంజీవి బహిరంగంగా స్పష్టం చేసిన విషయం తెలిసిందే. తెలుగు సినీ పరిశ్రమ పెద్దగా ఉండటం తనకు ఇష్టం లేదంటూ ఆయన స్పష్టం చేశారు. పెద్దరికాన్ని వహించాలంటూ అందిన విజ్ఞప్తులను నిర్ద్వందంగా తోసిపుచ్చారు. అయినప్పటికీ- వైఎస్ జగన్‌తో సంప్రదింపులు జరిపే బాధ్యతను మళ్లీ చిరంజీవే స్వీకరించడం చర్చనీయాంశమౌతోంది.

24 ఫ్రేమ్స్‌తో..
ప్రస్తుతం ప్రభుత్వం నియమించిన కమిటీ సినిమా టిక్కెట్ల ధరలపై తన నివేదికను సమర్పించడానికి సిద్ధమౌతోంది. ఆ కమిటీ నివేదిక ముసాయిదా అందిన తరువాత- ప్రభుత్వం ఒక్కసారి తుది నిర్ణయాన్ని తీసుకోవడమంటూ జరిగితే- అందులో ఇక మార్పులు చేర్పులు ఉండకపోవచ్చు. ఉత్తర్వులను జారీ చేయడానికి ముందే ఈ భేటీని ప్రభుత్వం షెడ్యూల్ చేసింది. నిర్మాతలు, నటీనటులు.. ఇలా 24 ఫ్రేమ్స్ ప్రతినిధుల నుంచి స్వీకరించిన అభిప్రాయాలతో కూడిన వినతిపత్రాన్ని చిరంజీవి సారథ్యంలోని టాలీవుడ్ ప్రతినిధుల బృందం ముఖ్యమంత్రికి అందజేసే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications