Ramgopal Varma: మళ్లీ హైకోర్టుకు రాంగోపాల్ వర్మ-ఒక్క పోస్టుకు ఇన్ని కేసులా..?
ఏపీలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో వ్యూహం పేరుతో సీఎం వైఎస్ జగన్ బయోపిక్ తీసిన టాలీవుడ్ దర్శకుడు రాంగోపాల్ వర్మ అప్పట్లో దీని ప్రచారం కోసం విపక్ష నేతలైన చంద్రబాబు, లోకేష్, పవన్ పై వివాదాస్పద పోస్టు పెట్టారు. దీనిపై ఏపీలోని వివిధ పోలీసు స్టేషన్లలో కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో గతంలో ఓసారి ఏపీ పోలీసులు నమోదు చేసిన తొలి కేసును క్వాష్ చేయాలని, తనను అరెస్టు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసారు.
అయితే రాంగోపాల్ వర్మ అరెస్టు కాకుండా ఆదేశాలు ఇవ్వలేమని హైకోర్టు తేల్చేసింది. కావాలంటే బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోవాలని సూచించింది. ఆలోపే ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసులు ఆయనకు విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారు. ఇలా రెండుసార్లు నోటీసులు పంపినా స్పందించకపోవడంతో వర్మను అరెస్టు చేసేందుకు పోలీసులు గాలింపు చేపట్టారు. దీంతో తాను ఎక్కడికీ పారిపోలేదని, షూటింగ్ లో ఉన్నానంటూ తాజాగా ఓ వీడియో కూడా విడుదల చేసారు.

అదే సమయంలో వర్మపై రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వరుస కేసులు నమోదవుతున్నాయి. దీంతో వర్మ మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు తనపై నమోదైన కేసులన్నీ క్వాష్ చేయాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. తాను ఎక్స్‌లో పెట్టిన పోస్టుపై అనేక కేసులు నమోదు చేస్తున్నారని పిటిషన్ లో పేర్కొన్నారు. చట్టవిరుద్ధంగా ఒక విషయంపై ఇన్ని కేసులు పెడుతున్నారని ఆర్జీవీ పిటిషన్ లో తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా కేసులు నమోదు చేయడం చట్ట విరుద్ధమన్నారు. ఇకపై ఈ పోస్టులపై కేసులు నమోదు చేయకుండా ఆదేశించాలని పిటిషన్ లో కోరారు. అలాగే ఇప్పటివరకు తనపై నమోదైన కేసులు క్వాష్ చేయాలని కోరారు. ఈ పిటిషన్ పై హైకోర్టు ఇవాళ విచారణ జరపనుంది.












Click it and Unblock the Notifications