రేపు జగన్ తో సినీ పెద్దల భేటీ-పేర్నినాని ప్రకటన- సీపీఐ నారాయణ షాకింగ్ కామెంట్స్
ఏపీలో సినిమా టికెట్ల వివాదానికి సంబంధించి సీఎం జగన్ తో చర్చించేందుకు రేపు టాలీవుడ్ పెద్దలు అమరావతికి రానున్నారు. ఈ మేరకు సీఎం జగన్ నిన్న వీరికి అపాయింట్ మెంట్ ఖరారు చేశారు. అయితే ఈ భేటీని ప్రభుత్వం అధికారికంగా ఇవాళ నిర్ధారించింది. అదే సమయంలో ఈ భేటీకి సంబంధించి సీపీఐ నారాయణ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

ఏపీకి టాలీవుడ్ హీరోలు
ఏపీలో కొంతకాలంగా వివాదాస్పదంగా మారిన సినిమా టికెట్ల ధరల వివాదంపై సీఎం జగన్ తో చర్చించేందుకు రేపు టాలీవుడ్ హీరోలు చిరంజీవి, నాగార్జునతో పాటు మరికొందరు అమరావతికి రానున్నారు. సినిమా టికెట్ల ధరలపై టాలీవుడ్ అభిప్రాయాన్ని సీఎం జగన్ తో పంచుకోవడంతో పాటు ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని కూడా వీరు తెలుసుకోనున్నారు. అలాగే సీఎం జగన్ తో సినిమా టికెట్ల ధరలపై నియంత్రణ ఎత్తివేతకు సంబంధించి హీరోలు కీలక చర్చలు జరపనున్నారు. దీంతో ఈ భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది.
భేటీ ఖరారు చేసిన పేర్నినాని
రేపు సీఎం జగన్‌తో సినీ పరిశ్రమ పెద్దలు భేటీని సినిమాటోగ్రఫీ మంత్రి పేర్నినాని ఇావాళ ఖరారు చేశారు. సీఎం జగన్ తో ఇవాళ మరోసారి భేటీ అయిన పేర్నినాని రేపు టాలీవుడ్ పెద్దలు ముఖ్యమంత్రితో భేటీ అవుతారని తెలిపారు. సినీ పరిశ్రమ సమస్యల గురించి వారు సీఎంతో మాట్లాడతారని వెల్లడించారు. ''రేపు ఉదయం 11 లేదా మధ్యాహ్నం 3 గంటలకు సమావేశం ఉంటుందని ఆయన వెల్లడించారు. సినీ పరిశ్రమ నుంచి ఎవరు వస్తారో రేపు ఉదయం చెబుతామన్నారు. వారు తమకేమీ అజెండా పంపలేదన్నారు. సినిమా టికెట్ల ధరపై కమిటీ నివేదిక ఇంకా రాలేదన్నారు. కమిటీ వచ్చాక పరిశీలించి తుది నిర్ణయం తీసుకుంటామని పేర్ని నాని తెలిపారు.

సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు
మరోవైపు రేపు సీఎం జగన్ తో టాలీవుడ్ పెద్దల భేటీపై సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమా టికెట్ల రేట్ల వ్యవహారంపై ఇటీవల చిరంజీవి జగన్ ను కలిశాక వివాదాస్పదమైందన్నారు. వాస్తవానికి సినీ ఛాంబర్ కుగానీ, నిర్మాతల మండలికి గాని సంబంధం లేకుండా వ్యక్తిగతంగా సినీ పెద్దలు మాట్లాడితే సమస్య ఎలా పరిష్కారం అవుతుందని ఆయన ప్రశ్నించారు. రేపు చిరంజీవితో పాటు ఒకరిద్దరు ఏపీ ప్రభుత్వంతో మాట్లాడతారంటున్నారు. కానీ ఆ విధంగా పరిష్కారం కాదన్నారు. మా అసోసియేషన్, సినీ ఛాంబర్ లు, ఏపీ ప్రభుత్వంతో కలిసి చర్చిస్తే ప్రయోజనం ఉంటుందన్నారు. అలా తప్పితే వ్యక్తిగతంగా కలిస్తే ఉపయోగం ఉండదన్నారు.
Recommended Video

డివైడ్ అండ్ రూల్ సరికాదన్న నారాయణ
టాలీవుడ్ కు చెందిన కొందరిని పిలిపించుకుని జగన్ చర్చలు జరపడాన్ని డివైడ్ అండ్ రూల్ గా నారాయణ అభివర్ణించారు.
పీఆర్సీ విషయంలో ఎన్జీవోలకు డివైడ్ అండ్ రూల్ పెట్టారని, అలా పెట్టి ఎన్జీవోలను రకరకాలుగా, చిత్తుచిత్తుగా చేసి సమస్య పరిష్కారం కాకుండా చేశారని నారాయణ ఆరోపించారు. ఇప్పుడు పీఆర్సీ సమస్య రావణాసురుడి కాష్టంలా మండుతూనే ఉందన్నారు.. ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్య పరిష్కారం కాలేదని బాధపడుతూ ఉంటే, ఏదో మేనేజ్ చేసి దానిని పరిష్కారం చేసినట్లుగా చూపారని నారాయణ తెలిపారు. సినీ పరిశ్రమను కూడా అదే విధంగా చేయాలని ప్రయత్నిస్తున్నారని నారాయణ విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం చట్టబద్దంగా పారదర్శకంగా సమస్య పరిష్కారానికి దోహదపడాలే తప్ప, మేనేజ్ చేసే పద్ధతిలో ఉంటే సినీ పరిశ్రమలో కూడా ఇదే ఈ విధంగా సంక్షోభం వస్తుంది. రావణాసురుడు కాష్టంలా మండుతూనే ఉంటుంది. దీనిని తిరిగి రాష్ట్ర ప్రభుత్వం మసలుకోవాలని కోరుతున్నానని తన తాజా వీడియోలో నారాయణ తెలిపారు.












Click it and Unblock the Notifications