వారికి భరోసాగా...జనంలోకి వైఎస్ జగన్; రేపటి షెడ్యూల్ ఇలా!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో శాంతిభద్రతలకు క్షీణించాయని వైసిపి పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తోంది. తాజాగా వైఎస్ఆర్సిపి అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో టిడిపి వేధింపులు పెరిగిపోయాయని, ముఖ్యంగా మహిళలపై అఘాయిత్యాలు, దాడులు పెరిగిపోయాయని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
గుంటూరు, వైఎస్సార్ కడప జిల్లాలలో వైఎస్ జగన్ పర్యటన
రాష్ట్రంలో జరుగుతున్న దారుణాల విషయంలో స్పందించిన జగన్ స్వయంగా బాధితులను కలిసి వారికి అండగా ఉంటానని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే తాజాగా మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ రేపు ప్రజాక్షేత్రంలోకి వెళ్ళనున్నారు. రేపు రెండు జిల్లాలలో పర్యటించనున్న జగన్ పర్యటనకు షెడ్యూల్ విడుదలైంది. అత్యాచార, హత్య సంఘటనలు జరిగిన గుంటూరు జిల్లాలోనూ, వైఎస్ఆర్ కడప జిల్లాలోనూ రేపు వైయస్ జగన్ పర్యటించనున్నట్టు వైఎస్ఆర్సిపి వర్గాలు వెల్లడించాయి.

రేపు గుంటూరు జిల్లాలో బాధిత యువతి కుటుంబాన్ని పరామర్శించనున్న జగన్
ఈ మేరకు జగన్ పర్యటన నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపు తాడేపల్లి నుండి మొదట గుంటూరు జిల్లాకు రోడ్డు మార్గంలో ప్రయాణించి జగన్ అక్కడ గుంటూరు జిల్లా తెనాలిలో ఇటీవల టిడిపి కార్యకర్త, రౌడీషీటర్ దౌర్జన్యం చేయడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిన యువతి కుటుంబ సభ్యులను జగన్ కలిసి వారికి భరోసా కల్పించనున్నారు.
బద్వేలు హత్యాచార బాలిక కుటుంబాన్ని పరామర్శించనున్న జగన్
పార్టీ తరపున బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం కూడా అందించడానికి జగన్ సిద్ధంగా ఉన్నారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఆపై జగన్ గుంటూరు జిల్లాలో యువతి కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం ప్రత్యేక విమానం ద్వారా వైయస్సార్ కడప జిల్లాకు చేరుకుని కడప విమానాశ్రయం నుంచి నేరుగా బద్వేలులో అత్యాచారం జరిగి, హత్యకు గురైన బాధిత బాలిక కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు.
రేపు పులివెందులలో జగన్
బద్వేలు లో అత్యాచారానికి గురై హత్య గావించబడిన బాలిక కుటుంబాన్ని రేపు మధ్యాహ్నం జగన్ పరామర్శించి వారికి భరోసా ఇవ్వనున్నారు. ఆపై అక్కడ నుంచి నేరుగా తన సొంత నియోజకవర్గమైన పులివెందులలో జగన్ పర్యటించనున్నారు ఈ మేరకు జగన్ పర్యటనకు సంబంధించి వైసీపీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.












Click it and Unblock the Notifications