విశాఖ ఫార్మా సిటీలోని ఫ్యాక్టరీలో విష వాయువులు లీక్.. పరుగులు పెట్టిన స్థానికులు, ఫ్యాక్టరీ ముందు ఆందోళన
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖ పరవాడలోని ఫార్మాసిటీలో ఓ ఫార్మా కర్మాగారం నుండి విషవాయువులు లీక్ అయిన ఘటన స్థానిక ప్రజలకు ఆందోళన కలిగించింది. విశాఖ జిల్లా పరవాడలోని జవహర్ లాల్ నెహ్రూ ఫార్మాసిటీ లో ఉన్న అడ్మిరన్ లైఫ్ సైన్సెస్ ఫార్మా కంపెనీ నుండి రసాయన విషవాయువులు వెలువడ్డాయి. దీంతో అక్కడ పనిచేస్తున్న కార్మికులు ఒక్కసారిగా ఆందోళనకు గురై పరుగులు తీశారు. సమీప పరిశ్రమలలో ఉన్న కార్మికులు కూడా ఉక్కిరిబిక్కిరై పరుగులు తీశారు. కళ్ళు మంటలు, శ్వాస తీసుకోవడంలోఇబ్బందులతో ఫ్యాక్టరీ పరిసరాల్లో ఉన్న ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

ఫార్మా కర్మాగారంలో విష వాయువుల లీకేజ్ తో తాడి గ్రామంలో ఆందోళన
విషవాయువులు పీల్చలేక ఉక్కిరిబిక్కిరయ్యారు. గతంలోనూ అనేక మార్లు ఇలాంటి ఇబ్బంది తలెత్తింది అంటూ స్థానికంగా ఉన్న ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక విషవాయువు ప్రభావంతో సమీపంలో ఉన్న తాడి గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొన్నారు. ఫార్మా సిటీ కంపెనీలోని రసాయన విషవాయువుల లీకేజీ ఘటనతో తాడి గ్రామస్తులు కంపెనీ ముందు బైఠాయించి ఆందోళన నిర్వహించారు. ఫ్యాక్టరీ యాజమాన్యం తమ ప్రాణాలకు భరోసా ఇవ్వాలని డిమాండ్ చేశారు. తమకు ఎలాంటి ముప్పు వాటిల్లదు అని చెప్పాలని వారు కోరారు.

కర్మాగారం ముందు బైఠాయించి ఆందోళన చేసిన గ్రామస్తులు
తమ ప్రాణాలతో చెలగాటం ఆడవద్దని యాజమాన్యానికి విజ్ఞప్తి చేశారు. కర్మాగార యాజమాన్యం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నదని మండిపడుతున్న స్థానికులు ఫ్యాక్టరీ నిబంధనలు పాటించలేదని ధ్వజ మెత్తారు. సదరు కంపెనీపై అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఫార్మా కంపెనీ వల్ల ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని ఆందోళన నెలకొందని వారు చెబుతున్నారు. వ్యర్ధ రసాయనాలను శుద్ధిచేసి సముద్రానికి పంపించాలని, విష వాయువులు లీక్ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, కానీ ఫ్యాక్టరీ అలాంటి నిబంధనలను పాటించడం లేదని స్థానికులు మండిపడుతున్నారు.

నిబంధనలు పాటించని ఫార్మా కర్మాగారం
గతంలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డుతో పాటుగా అగ్నిమాపక శాఖ, తదితర శాఖలు నిర్వహించిన సేఫ్టీ ఆడిట్ లో ఈ కర్మాగారం సి కేటగిరీలో ఉందని, అయినప్పటికీ అధికారులు ఎందుకు చర్యలు తీసుకోలేదని వారు ప్రశ్నిస్తున్నారు. కర్మాగారానికి తాడి గ్రామానికి మధ్య కనీసం 20 మీటర్ల గ్యాప్ కూడా లేని కారణంగా రసాయన పరిశ్రమ ప్రభావం తాడి గ్రామస్తులపై పడుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాడి గ్రామంలోని ప్రజలు అర చేతిలో ప్రాణాలు పెట్టుకుని నివసిస్తున్నారని, కంటినిండా నిద్ర కూడా పోవట్లేదని చెబుతున్నారు.

కర్మాగారం యాజమాన్యంపై చర్య తీసుకోవాలని డిమాండ్
కర్మాగారం పరిసరాల్లో స్వచ్ఛమైన గాలి, నీరు దొరకటం కూడా కష్టంగా ఉందని వారంటున్నారు. ఇప్పటికైనా అధికార యంత్రాంగం కర్మాగార యాజమాన్యంపై చర్యలు తీసుకోకుంటే భవిష్యత్తులో ఆందోళనలు ఉదృతం చేస్తామని అంటున్నారు. ఇదిలా ఉంటే గతంలో విశాఖలో ఎల్జి పాలిమర్స్ గ్యాస్ లీక్ దుర్ఘటన నేటికీ విశాఖ నగరంలోని ప్రజలకు నాటి విషాదాన్ని గుర్తు చేస్తుంది. విశాఖలోని వెంకటాపురం సమీపంలో ఎల్జి పాలిమర్స్ లో 2020 మే 7వ తేదీన గ్యాస్ లీక్ కావడంతో 15 మంది చనిపోగా వందల సంఖ్యలో అస్వస్థతకు గురైన ఘటన నేటికీ అక్కడి ప్రజలు మర్చిపోలేదు. ఇప్పుడు ఎక్కడ ఏ చిన్న గ్యాస్ లీక్ గాని, విషవాయువుల లీకేజ్ గానీ జరిగినా నాటి సంఘటనను గుర్తుచేసుకుని భయపడుతున్నారు. తమ పరిస్థితి ఎలా ఉంటుందోనని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications