ఏపీలోని ఈ జిల్లాల వారికి ట్రాఫిక్ ఆంక్షలు...
ఏపీలోని ఆ జిల్లాల వారికి అలర్ట్. బాపట్ల జిల్లా వారికి ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ రాష్ట్రప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మార్చి పదోతేదిన అంటే ఆదివారం బాపట్ల జిల్లా కొరిశపాడు మండలంలో వైఎస్సార్‌సీపీ సిద్ధం సభ జరగనుంది. ఈ సభకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్‌రెడ్డి హాజరుకానున్నారు. భారీ ఎత్తున్న జరగబోతున్న ఈ సభకు ప్రజలు కూడా భారీ సంఖ్యలో వచ్చే అవకాశం వుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకోసం ట్రాఫిక్ మళ్లిస్తున్నట్లు పోలీసులు వివరించారు.
అటువైపుగా ప్రయాణించేవారికి ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా వాహనాలను దారి మళ్లిస్తున్నట్లు బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ వివరించారు. ఈ ట్రాఫిక్ మార్పుల్ని గమనించి ప్రజలు సహకరించాలని అధికారులు కోరారు. నెల్లూరు వైపు నుంచి ఒంగోలు మీదుగా హైదరాబాదు వైపు వెళ్లే భారీ వాహనాలను ఒంగోలు సౌత్ బైపాస్ నుంచి సంఘమిత్ర హాస్పిటల్, కర్నూల్ రోడ్డు, చీమకుర్తి, పొదిలి దొనకొండ అడ్డరోడ్డు మీదుగా హైదరాబాద్‌కు దారి మళ్లించడం జరిగిందని అధికారులు తెలిపారు.

ఇక, హైదరాబాద్ వైపు నుంచి ఒంగోలు వైపునకు వచ్చు భారీ వాహనాలను సంతమాగులూరు అడ్డరోడ్డు, వినుకొండ, మార్కాపురం, పొదిలి, చీమకుర్తి మీదుగా దారి మళ్లించినట్లు వివరించారు. నెల్లూరు వైపు నుంచి ఒంగోలు మీదుగా హైదరాబాదు వైపు వెళ్లే సాధారణ వాహనాలను మేదరమెట్ల వద్ద నుంచి నామ్ హైవేపై అద్దంకి, సంతమాగులూరు మీదుగా వెళ్లాలని సూచించారు.
మార్చి పదో తేదిన ఈ జిల్లాలకు ట్రాఫిక్ ఆంక్షలు..
వైజాగ్ నుంచి ఒంగోలు, చెన్నై వైపు వెళ్లే వాహనాలను నర్సాపురం, మచిలీపట్నం, బాపట్ల, చీరాల, త్రోవగుంట మీదుగా దారి మళ్లించినట్లు అధికారులు తెలిపారు. అలాగే, ఒంగోలు వైపు నుంచి వైజాగ్ వైపు NH16పై వెళ్లే వాహనాలను త్రోవగుంట నుంచి NH 216పైకి దారి మళ్లించి త్రోవగుంట, చీరాల, బాపట్ల, మచిలీపట్నం మీదుగా దారి మళ్లించడం జరిగింది. ఒంగోలు వైపు నుంచి విజయవాడ, గుంటూరు వైపు NH16పై వెళ్లే వాహనాలను త్రోవగుంట, చీరాల, బాపట్ల, పొన్నూరు మీదుగా దారి మళ్లించినట్లు అధికారులు తెలిపారు.

ఒంగోలు వైపు నుంచి చిలకలూరిపేట వైపు వెళ్లే వాహనాలను త్రోవగుంట, చీరాల, పర్చూరు మీదుగా దారి మళ్లించారు. అలాగే, గుంటూరు నుంచి ఒంగోలు, చెన్నై వైపు వెళ్ళు వాహనాలను బుడంపాడు అడ్డరోడ్డు నుంచి పొన్నూరు, బాపట్ల, చీరాల, త్రోవగుంట మీదుగా దారి మళ్లించడం జరిగిందని అధికారులు వివరించారు. వీటితోపాటు చిలకలూరిపేట వైపు నుంచి ఒంగోలు, నెల్లూరు వైపు వెళ్లే వాహనాలను పర్చూరు, చీరాల, త్రోవగుంట మీదుగా దారి మళ్లించారు. ఇక, ఈ ట్రాఫిక్ ఆంక్షలన్నీ మార్చి పదో తేదీ ఉదయం నుంచి అమల్లోకి రానున్నట్లు పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications