అక్కడ వాటర్ ట్యాంక్ క్రిందే గర్భిణీలకు చికిత్స.. ఇదేనా ఆరోగ్యాంధ్రప్రదేశ్!!
వైద్య రంగానికి పెద్దపీట వేస్తున్నామని చెబుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలాచోట్ల మౌలిక సదుపాయాల లేమి ఏపీలో వైద్య ఆరోగ్యశాఖ పరిస్థితికి అద్దం పడుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దుతామని చెబుతున్న జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలకు భిన్నంగా ఏపీలో వైద్య వనరుల లేమి వేధిస్తుంది. ఏపీలో మంత్రులు చెబుతున్నదానికి ఏ విధంగానూ పొంతన లేకుండా క్షేత్రస్థాయిలో పరిస్థితులు అనేక చోట్ల దారుణంగా ఉన్నాయి.
వాటర్ ట్యాంక్ క్రింద గర్భిణీ మహిళలకు చికిత్స
తాజాగా కోనసీమ జిల్లాలో తాగునీటి వాటర్ ట్యాంక్ కింద గర్భిణీ మహిళలకు చికిత్స అందిస్తున్న పరిస్థితులు చోటుచేసుకున్నాయి. కాట్రేనికోన మండలం పల్లంకుర్రు ప్రాథమిక వైద్యశాలలో గర్భిణీ స్త్రీలు రోగుల పరిస్థితి వర్ణనాతీతంగా మారింది. ఆసుపత్రి భవనం సరిగా లేకపోవడంతో గర్భిణీలు, బాలింతలు, ఆసుపత్రికి వచ్చిన రోగులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఆసుపత్రి పాత భవనాన్ని కూల్చివేయడంతో, ఏడు సంవత్సరాలుగా పంచాయితీ ప్రక్కనే ఉన్న సందులో రెండు ఇరుకు గదులలో పీహెచ్సీ వైద్యులు రోగులకు వైద్య సేవలు అందిస్తున్నారు.

ఆసుపత్రి భవనం లేక.. వాటర్ ట్యాంక్ క్రింద బల్లల మీదే వైద్యం
మంచినీటి ఓవర్ హెడ్ ట్యాంకు కింద సిమెంట్ బల్లలపై గర్భిణీ స్త్రీలకు సెలైన్లు ఎక్కిస్తున్నారు వైద్యులు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి బదులు పెద్ద ఆసుపత్రికి వెళ్లాలంటే సుదూర ప్రాంతాలకు వెళ్లవలసి వస్తుందని రోగులు వాపోతున్నారు. ఆస్పత్రి భవనం లేక వాటర్ ట్యాంక్ క్రింద బల్లల మీద మహిళలు ఇబ్బందులు పడుతున్నారని చెప్తున్నారు. తమ ఇబ్బందిని ప్రభుత్వం ఇప్పటికైనా అర్థం చేసుకుని తమకు ఆసుపత్రిని, మౌలిక వసతులను కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.

ఏపీ ఆస్పత్రుల్లో మౌలిక వసతుల లేమిపై ప్రభుత్వం దృష్టి సారిస్తుందా?
ప్రైవేట్ ఆస్పత్రులకు బదులు ప్రభుత్వ ఆసుపత్రులకే ప్రజలు రావాలని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వసతులను కల్పిస్తున్నామని చెబుతున్న ఏపీ ప్రభుత్వం కోనసీమ జిల్లాలోని ఈ ఆసుపత్రి పరిస్థితిని గుర్తిస్తే ప్రభుత్వ ఆసుపత్రులలో మౌలిక వసతుల లేమి ఏ విధంగా ఉందో అర్థమవుతుంది.
ఇప్పటికైనా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రులలో మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారించి, ప్రజలకు వైద్య సేవలను అందించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి ఉంది. మరి ఈ వ్యవహారంతో నైనా ప్రభుత్వం దృష్టి సారిస్తుందా? కోనసీమ జిల్లాలో ఆసుపత్రి లేక ఇబ్బంది పడుతున్న పల్లంకుర్రు గర్భిణీ మహిళల ఇబ్బందులు తీరుతాయా? అనేది తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications