విజయవాడ-సింగపూర్ ప్రయాణికులకు కేంద్రం శుభవార్త..!
విజయవాడ నుంచి సింగపూర్ వెళ్లాలనుకునే వారికి కేంద్రం శుభవార్త చెప్పింది. విజయవాడ నుంచి మధ్యలో బ్రేక్ లేకుండా నేరుగా సింగపూర్ కు వెళ్లేలా కొత్త ఇండిగో విమాన సర్వీసును త్వరలో ప్రారంభించబోతోంది. దీనికి సంబంధించిన వివరాలను పౌర విమానయానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఇవాళ ప్రకటించారు. ఈ సర్వీస్ అందుబాటులోకి వస్తే కలిగే ప్రయోజనాలను ఆయన వివరించారు.
విజయవాడ - సింగపూర్ మధ్య కొత్త విమాన సర్వీస్‌ను ఇండిగో ఎయిర్ లైన్స్ ప్రారంభించనుంది. విజయవాడ నుండి వారానికి మూడు సార్లు మంగళ, గురు, శనివారాల్లో ఈ సర్వీసు అందుబాటులో ఉంటుందని పౌర విమానయానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఈ నవంబర్ 15 నుండి ఈ ఇండిగో విమాన సర్వీసు ప్రారంభం కానుందని రామ్మోహన్ నాయుడు తెలిపారు. విజయవాడ నుండి సింగపూర్ లోని ఛాంగీ విమానాశ్రయాల మధ్య నేరుగా వారానికి మూడు సార్లు ఈ విమాన సర్వీసు నగర వాసులకు అందుబాటులో ఉంటుంది.

ఈ సర్వీసు విషయంలో ఈ సంవత్సరం జులై 28వ తేదీన సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటన సమయంలో ప్రస్తావన వచ్చినట్టు రామ్మోహన్ నాయుడు గుర్తు చేశారు. ప్రవాసాంధ్రుల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు వంద రోజులోనే సర్వీసును ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. స్వర్ణాంధ్ర 2047లో ప్రవాసాంధ్రుల పాత్ర అత్యంత కీలకమైనదని రామ్మోహన్ పేర్కొన్నారు. చంద్రబాబు విజన్ ను అమలుచేస్తున్న నేపథ్యంలో విమానయాన అవసరాలు పెరగనున్నాయనీ,, భవిష్యత్ లో కోటికి పైగా ప్రవాసాంధ్రులు ప్రయాణాలు జరిపే అవకాశం ఉండటంతో ఇంటర్నేషనల్ కనెక్టివిటీని మరింత విస్తృతం చేస్తామని రామ్మోహన్ తెలిపారు.

ప్రజలు, వ్యాపారవేత్తలు, విద్యార్థుల అవసరాలను పరిగణనలోకి తీసుకుని ఈ విమాన సర్వీసును అందుబాటులోకి తెచ్చినట్లు రామ్మోహన్ తెలిపారు. పౌర విమానయాన అభివృద్ధిలో విప్లవాత్మక ముందడుగుగా దీన్ని అభివర్ణించారు. విజయవాడ ప్రాంతవాసులు, ప్రజా ప్రతినిధులు, పారిశ్రామిక వేత్తలు, విద్యార్థి సంఘాలు ఈ సర్వీసు పట్ల ఆసక్తిగా ఉన్నారన్నారు. ఈ నేపథ్యంలో స్థానికుల అభ్యర్థన, ఆలోచన మేరకు కేంద్రం సానుకూలంగా స్పందించడంతో నూతన విమాన సర్వీసు ఏర్పాటుకు రామ్మోహన్ చొరవ తీసుకున్నారు. అంతర్జాతీయ స్థాయిలో విజయవాడ అభివృద్ధి సాధించేందుకు ఈ విమాన సర్వీసు దోహదపడుతుందని, రాబోయే రోజుల్లో మరిన్ని అంతర్జాతీయ రూట్లు తెరవాలని స్థానికులు కోరుతున్నారు.












Click it and Unblock the Notifications