కుటుంబం మొత్తానికి వీఐపీ దర్శనం!
తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. తిరుమలలోని అన్నమయ్య భవన్ లో ttd పాలక మండలి సమావేశం జరిగింది. అనంతరం మీడియాతో మాట్లాడిన భూమన టీటీడీ చైర్మన్ గా, ఓ రాజకీయ నేతగా ఉదయనిధి వ్యాఖ్యలను ఖండిస్తున్నానన్నారు.
సనాతన ధర్మం వ్యాప్తి చెందేందుకు పాలక మండలి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. యువత, నేటితరం చిన్నారుల్లో భక్తిభావన పెంపొందించేందుకు గోవిందకోటి రాసేలా ప్రోత్సహించనున్నారు. ఎల్ కేజీ నుంచి పీజీ చదివే విద్యార్థుల వరకు శ్రీవారి పుస్తక ప్రసాదంగా కోటి భగవద్గీత పుస్తకాలను పంపిణీ చేయనున్నారు. 25 సంవత్సరాలోపు గోవిందకోటి రాసిన భక్తుల కుటుంబాలకు వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించనున్నారు. అలాగే 10 లక్షల 1,116 సార్లు గోవింద కోటి రాసిన భక్తులకు బ్రేక్ దర్శనం కల్పించనున్నారు.

అలాగే ఈ ఏడాది రెండు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. సెప్టెంబరు 18వ తేదీన ముఖ్యమంత్రి జగన్ స్వామివారికి పట్టువస్త్రాలను సమర్పిస్తారు. అలాగే టీటీడీలో 413 కొత్త పోస్టుల నియామకానికి ప్రభుత్వం అనుమతి కోరుతూ సిఫార్సు చేశారు. తిరుపతిలోని గోవిందరాజస్వామి సత్రాలను తొలగించి వసతి సముదాయాలు నిర్మించనున్నారు. రూ.600 కోట్లతో 20వేల మందికి వసతి కల్పించేలా సముదాయాలు నిర్మించాలని పాలకమండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ముంబయిలో శ్రీవారి రెండో ఆలయ నిర్మాణానికి రూ.1.65 కోట్లు, సమాచార కేంద్రం ఏర్పాటుకు రూ.5.35 లక్షలు కేటాయించారు.












Click it and Unblock the Notifications