తిరుమలలో ఆకస్మిక తనిఖీలు
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. మంగళవారం నాడు 65,487 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 23,909 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 4.75 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది.
వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 22 కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 నుంచి 20 గంటల సమయం పట్టింది. కంపార్ట్‌మెంట్లు, క్యూ లైన్లల్లో ఉన్న వారికి టీటీడీ సిబ్బంది అన్నప్రసాదం, మజ్జిగ, మంచినీరు, అల్పాహారాన్ని పంపిణీ చేశారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం తిరుమలకు రానున్నారు. భార్య భువనేశ్వరి, కుమారుడు, మంత్రి నారా లోకేష్, కోడలు నారా బ్రాహ్మణి, మనవడు దేవాన్ష్‌తో కలిసి తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామివారి దర్శించుకోనున్నారు. సాయంత్రం తిరుమలకు చేరుకుంటుంది చంద్రబాబు కుటుంబం. పద్మావతి అతిథి గృహంలో బస చేస్తుంది.
ఆ మరుసటి రోజు అంటే 21వ తేదీన తెల్లవారు జామున చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులు శ్రీవారి సేవలో పాల్గొననున్నారు. 21వ తేదీన దేవాన్ష్ పుట్టినరోజు కావడం వల్ల ఆ ఒక్కరోజు తిరుమల శ్రీవారి భక్తుల భోజనానికి అయ్యే మొత్తం ఖర్చును చంద్రబాబు భరించనున్నారు.
దీనికి అవసరమైన ఒకరోజు మొత్తం ఖర్చు 44 లక్షల రూపాయలను టీటీడీ శ్రీవేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్ట్‌కు విరాళంగా అందించనున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు కుటుంబ సభ్యులు తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో భక్తులకు స్వయంగా అన్నప్రసాదం వడ్డించనుంది.
ఈ పర్యటన నేపథ్యంలో టీటీడీ అదనపు కార్యనిర్వహణాధికారి సీహెచ్ వెంకయ్య చౌదరి ఈ మధ్యాహ్నం మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రంలో తనిఖీలు నిర్వహించారు. టీటీడీ విజిలెన్స్, ఇంజినీరింగ్, గార్డెన్, అన్న ప్రసాద విభాగం అధికారులకు పలు సూచనలు ఇచ్చారు.
చంద్రబాబు పర్యటన సందర్భంగా ఎలాంటి లోపాలు తలెత్తకూడదని, దీనికి అనుగుణంగా ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేయాలని వెంకయ్య చౌదరి అన్నారు. అనంతరం అన్న ప్రసాదం నాణ్యత, రుచిపై భక్తులతో నేరుగా మాట్లాడారు. వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా భక్తులు అన్న ప్రసాదం చాలా రుచికరంగా ఉందంటూ సంతృప్తి వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications