శ్రీవారి సేవ, దర్శనం టికెట్ల కోసం కౌంటర్లకు అవసరం లేదు - కొత్త విధానం అమలు..!!
Tirumala: టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. సిఆర్ఓలో లక్కీడిప్ లో సేవాటికెట్లు పొందిన భక్తులకు "పే లింక్" ఎస్ఎంఎస్ అవకాశం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇక నుంచి కౌంటర్ వద్దకు వెళ్లాల్సిన పని లేకుండా కొత్త విధానం అమల్లోకి వచ్చింది. ఆన్లైన్లో సొమ్ము చెల్లించి టికెట్ ప్రింట్ తీసుకోవచ్చని స్పష్టం చేసింది. అదే విధంగా త్వరలోనే ఇదే తరహాలో బ్రేక్ దర్శన టికెట్లకు కూడా ఈ సదుపాయం తీసుకు రావాలని నిర్ణయించింది.
"పే లింక్" ఎస్ఎంఎస్ : తిరుమలలో ఆఫ్ లైన్ విధానంలో శ్రీవారి ఆర్జితసేవలు, బ్రేక్ దర్శనం పొందిన భక్తులు టికెట్లు పొందే ప్రక్రియను మరింత సులభతరం చేసేందుకు టీటీడీ నూతన విధానాన్ని ప్రవేశపెట్టింది. "పే లింక్" ఎస్ఎంఎస్ ద్వారా భక్తులు కౌంటర్ల వద్దకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఆన్లైన్లో సొమ్ము చెల్లించి సేవా టికెట్లను ప్రింట్ తీసుకోవచ్చు. సిఆర్ఓలో లక్కీడిప్ ద్వారా ఆర్జిత సేవాటికెట్లను భక్తులకు కేటాయిస్తున్న విషయం తెలిసిందే. ఈ విధానంలో టికెట్లు పొందిన భక్తులు కౌంటర్ వద్దకు వచ్చి సొమ్ము చెల్లించి టికెట్లు పొందాల్సి వచ్చేది. నూతన విధానంలో ఎస్ఎంఎస్ ద్వారా పే లింక్ ను పంపుతారు.

రేపు ఆర్జిత సేవా టికెట్లు : భక్తులు ఆ లింక్ పైన క్లిక్ చేసి యుపిఐ లేదా క్రెడిట్ కార్డు లేదా డెబిట్ కార్డు ద్వారా ఆన్లైన్ లో సొమ్ము చెల్లించి సేవా టికెట్లు ప్రింట్ తీసుకోవచ్చు. ఈ నూతన విధానాన్ని ప్రస్తుతం సిఆర్వోలోని లక్కీడిప్ కౌంటర్ల వద్ద ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. త్వరలో ఎంబీసీ-34 కౌంటర్ వద్ద విచక్షణ కోటాలో కేటాయించే ఆర్జిత సేవా టికెట్లు, బ్రేక్ దర్శన టికెట్లకు కూడా ఈ విధానం అమలుకానుంది. అక్టోబర్ నెలకు సంబంధించి కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవ, సహస్రదీపాలంకార సేవాటికెట్లను జూలై 21వ తేదీ ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది.
రూ 300 టికెట్ల పెంపు : అక్టోబరు నెల ఆంగప్రదక్షిణం టోకెన్ల కోటాను జూలై 24వ తేదీ ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నారు. భక్తులు ఈ విషయాలను గమనించి https://tirupatibalaji.ap.gov.in వెబ్ సైట్ లో సేవా టికెట్లను బుక్ చేసుకోవాలని టీటీడీ సూచించింది. వేసవి రద్దీ కారణంగా తగ్గించిన రూ 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను మరో నాలుగు వేల వరకు పెంచుతున్నట్లు టీటీడీ ఈవో ధర్మారెడ్డి ప్రకటించారు. అదే విధంగా దర్శనం సమయంలో తోపులాట లేకుండా ఉండేందుకు వెండివాకిలి నుంచి సింగిల్ లైన్ విధానం అమలు చేస్తామని వెల్లడించారు.












Click it and Unblock the Notifications