TTD: సింఘాల్ పై వేటు, టీటీడీకి నూతన ఈవో- ఏం జరుగుతోంది...!?
ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ పై బదిలీ వేటుకు రంగం సిద్దం అయింది. అనిల్ కుమార్ సింఘాల్ స్థానంలో సీనియర్ ఐఏఎస్ పేరును ప్రభుత్వం ఖరారు చేసింది. తిరుమలలో లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారం పైన విచారణ చేస్తున్న సిట్ తాజాగా ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. అందులో గతంలో ఈవోగా పని చేసిన సమయంలో అనిల్ కుమార్ సింఘాల్ పైన చర్యలు తీసుకోవాలని సిఫారసు చేసింది. దీంతో, ఇప్పుడు సింఘాల్ ను బదిలీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
టీటీడీ లో కల్తీ నెయ్యి వ్యవహారంపై దర్యాప్తు జరుపుతున్న సిట్ తాజాగా రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. కల్తీ నెయ్యి సరఫరా కావడానికి టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి హయాంలో నెయ్యి సేకరణ విధానంలో తెచ్చిన మార్పులే కారణమని దర్యాప్తు అధికారులు నిర్ధారించినట్టు తెలిసింది. అప్పటి, ప్రస్తుత ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ ఈ వ్యవహారాన్ని సకాలంలో గుర్తించకపోవడం లేక గుర్తించినా చూసీ చూడనట్లు వదిలేయడం క్షమించరాని నేరంగా సిట్ ఆక్షేపించినట్టు తెలుస్తోంది. విధి నిర్వహణలో ఆయన తీవ్ర నిర్లక్ష్యం వహించారని, టీటీడీ పాలక మండలి ఒత్తిడికి తలొగ్గారని గుర్తించినట్టు తెలిసింది. దీంతో.. అనిల్ కుమార్ సింఘాల్, ధర్మారెడ్డి, చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ బాలాజీ పై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సిట్ సిఫారసు చేసింది. దీంతో, అనిల్ కుమార్ సింఘాల్ ను బదిలీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఈ రోజు లేదా రేపు ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.













Click it and Unblock the Notifications